హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద నిన్న (డిసెంబర్ 04న) రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటనపై చిక్కడపల్లి పోలీసు స్టేషన్లో అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదైంది. సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్.. సంధ్య థియేటర్‌కు వచ్చినప్పుడు భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ వస్తున్న సమాచారాన్ని పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీమ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ వెల్లడించారు. బుధవారం (డిసెంబర్ 04న) రాత్రి 9 గంటల 40 నిమిషాలకు పుష్ప-2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్లో ఏర్పాటు చేశారని.. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారని ఆయన చెప్పారు. అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్‌కు వస్తారనే సమాచారం తమకు లేదని.. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా తమకు సమాచారం ఇవ్వలేదన్నారు. సమాచారం ఇవ్వకపోగా.. యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని.. పబ్లిక్‌ను అదుపుచేసేందుకు థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.