నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోండి.. నా పేరును మీ రాజకీయ పోరాటాలకు వాడకోకండి.. అంటూ మంత్రి కొండా సురేఖ (Konda Surekha)కు సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్‌ని ఉద్దేశిస్తూ అక్కినేని ఫ్యామిలీతో ముడిపెడితూ.. కొండా సురేఖ సమంత విడాకుల గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కింగ్ నాగార్జున తీవ్రంగా ఖండిస్తూ.. అబద్దాలుగా కొట్టిపారేశారు. తాజాగా సమంత కూడా ఇన్‌స్టా వేదికగా మంత్రికి సమాధానమిచ్చింది. సమంత (Samantha) తన పోస్ట్‌లో ఏం చెప్పిందంటే…
‘‘స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి పని చేయడానికి, స్త్రీలను ఆసరాగా భావించే ఆకర్షణీయమైన పరిశ్రమలో మనుగడ సాగించడానికి, ప్రేమలో పడటానికి, ప్రేమలో నుంచి బయట పడటానికి, ఇంకా నిలబడి పోరాడటానికి.. వీటన్నింటికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారూ, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి దీనిని చిన్నచూపు చూడకండి.
ఒక మంత్రిగా మీ మాటకు చాలా వేల్యూ ఉంటుందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నాను. వ్యక్తుల గోప్యత పట్ల బాధ్యతగా మరియు గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. విషయాలను ప్రైవేట్‌గా ఉంచాలనే మా ఎంపిక తప్పుగా సూచించడాన్ని ఆహ్వానించను. నా విడాకులు పరస్పర అంగీకారం మరియు సామరస్యపూర్వకంగా జరిగాయి. ఇందులో ఎటువంటి రాజకీయ కుట్రకు ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను మరియు అలానే కొనసాగించాలనుకుంటున్నాను..’’ అంటూ సమంత తన పోస్ట్‌లో పేర్కొంది.