ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా తెలంగాణ పోలీసుల ధైర్య సాహసాలు కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. ఇందుకు వేదికగా మారింది హైదరాబాద్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో హోం శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా పలు స్టాల్స్ లను ఏర్పాటు చేయగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, అధికారులు వాటిని పరిశీలించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అంబేడ్కర్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఏడో గ్యారంటీగా స్వేచ్ఛను అందించామన్నారు. ఒకనాడు రాజకీయ ఒత్తిడికి తలొగ్గి పోలీసులు పని చేసే పరిస్థితి.. కానీ, ఈ ఏడాది కాలంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి, పైరవీలకు తావు లేకుండా సమర్ధత ఆధారంగా అధికారుల నియామకాలు జరిగాయని సీఎం రేవంత్ అన్నారు.
డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు పోలీస్ శాఖలో దాదాపు 15 వేల నియామక పత్రాలు అందించామని సీఎం రేవంత్ తెలిపారు. పీజీలు, పీహెచ్‌డీలు చదువుకున్నవారు కూడా పోలీస్ శాఖలో చేరుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ముందుకు వస్తున్నారు. సైబర్ క్రైమ్‌ను నియంత్రించడంతో పాటు డ్రగ్స్‌ను నిరోధించాల్సిన అవసరం ఉంది.డ్రగ్స్ సరఫరా చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు సీఎం రేవంత్. బీటెక్, ఎంటెక్ చదివిన వారికి సైబర్ క్రైమ్‌లో డాటా అనాలసిస్ చేసేందుకు ప్రత్యేక అవకాశం కల్పించండి. రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యేక శిక్షణ అందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోకి డ్రగ్స్, గంజాయి రావాలంటే భయపడేలా పోలీస్ సిబ్బంది కృషి చేస్తున్నారని రేవంత ప్రశంసించారు.
ట్రాఫిక్, కాలుష్యం హైదరాబాద్ నగరాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు అని చెప్పారు సీఎం రేవంత్. ట్రాన్స్ జెండర్స్‌పై గత ప్రభుత్వాలు మానవీయ కోణంతో వ్యవహరించకపోవడం వల్ల వారు నిరాదరణకు గురయ్యారు. అందుకే ట్రాఫిక్ నియంత్రణకు వారిని నియమించడం ద్వారా వారికి మంచి భవిష్యత్ ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్స్ ను ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది అని సీఎం రేవంత్ చెప్పారు. ట్రాన్స్ జెండర్లకు డబుల్ బెడ్రూం ఇళ్లు అందిస్తామన్నారు. హోంగార్డులపై రేవంత్ వరాలు ఐపీఎస్ అధికారి తీవ్రవాదుల దాడిలో మరణిస్తే రూ.2 కోట్లు అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 6 హోంగార్డ్స్ రైజింగ్ డే. ఈ సందర్బంగా వారికి ఒక శుభ వార్త చెబుతున్నాం.. హోమ్ గార్డుల దినభత్యాన్ని రూ.921 నుంచి రూ.1000కి పెంచుతున్నాం. హోమ్ గార్డ్స్ weekly parade allowanceను నెలకు రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నాం. హోమ్ గార్డ్స్ దురదృష్టవశాత్తు సహజ మరణం పొందినా, accidental మరణం చెందినా Rs. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ అన్నారు.