ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక నాయకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు (Sadhguru Jaggi Vasudev) న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో (Apollo Hospital) అత్యవసర బ్రెయిన్ సర్జరీ (Brain Surgery) జరిగింది. నాలుగు వారాల నుంచి తీవ్ర తలనొప్పితో (Severe Headache) బాధపడుతున్న ఆయన్ను పరిశీలించగా.. మెదడులో భారీ రక్తస్రావంతో పాటు వాపు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఈనెల 17వ తేదీన బ్రెయిన్ సర్జరీ చేశామని, ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సద్గురు ఆసుపత్రిలో పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటున్నారని స్పష్టం చేశారు.
అపోలో ఆసుపత్రిలోని సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ వినిత్ సూరి ఈ సర్జరీకి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. తీవ్ర తలనొప్పితో ఆయన ఆసుపత్రికి వచ్చినప్పుడు తాము CT-స్కాన్ నిర్వహించామని.. రిపోర్ట్‌లో సద్గురు మెదడులో రక్తస్రావంతో పాటు వాపు ఉన్నట్లు తేలిందని చెప్పారు. తన రోజువారి కార్యకలాపాల్లో తలనొప్పి సమస్యను సద్గురు పెద్దగా పట్టించుకోలేదని.. అయితే మార్చి 15న నొప్పి మరింత తీవ్రమవ్వడంతో తనని సంప్రదించారని అన్నారు. అప్పుడే ఏదో చెడు జరుగుతోందన్న విషయాన్ని తాను గ్రహించానన్నారు. మార్చి 17న సద్గురు నాడీ సంబంధిత స్థితి వేగంగా క్షీణించిందని, దాంతో ఆయనకు వాంతులు అయ్యాయని చెప్పారు. అప్పుడు ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వగా.. CT-స్కాన్ చేశామన్నారు.
ఆ రిపోర్ట్ ఆధారంగా సద్గురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారన్న విషయం తేలిందని.. దీంతో కొన్ని గంటల్లోనే ఆయనకు మెదడు శస్త్రచికిత్స చేశామని డాక్టర్ వినిత్ సూరి వెల్లడించారు. ఆ సర్జరీని వినిత్ సూరి, ప్రణవ్ కుమార్, సుధీర్ త్యాగి, ఎస్ ఛటర్జీ నేతృత్వంలోని వైద్యుల బృందంలో నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని.. మెదడు, శరీరం, వైటల్ పారామీటర్స్ సాధారణ స్థితికి చేరుకున్నాయని చెప్పారు. తాము ఊహించిన దానికంటే వేగంగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు. మరోవైపు.. అపోలో ఆసుపత్రిలోని న్యూరో సర్జర్లు తన పుర్రెను కోసి ఏదో శోధించేందుకు ప్రయత్నించారని, కానీ వాళ్లు ఏమీ కనుగొనలేకపోయారంటూ సర్జరీ అనంతరం సద్గురు ఛలోక్తులు పేల్చారు.