హైదరాబాద్ పాతబస్తీలో ఆర్ఎస్‌ఐ అనుమానస్పదస్థిలో మృతి చెందాడు. హుస్సేనియాలం పీఎస్ పరిధిలోని కబూతర్ ఖానా వద్ద పోలీసు పికెట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్ తుపాకీ తుటా తగిలి ప్రాణాలు కోల్పోయాడు. గన్ నుంచి బుల్లెట్ తలలోకి దూసుకెళ్లటంతో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
కాగా, ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తున గన్ మిస్‌ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఆయన ఆత్మహత్య కూడా చేసుకొని ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. అతడి మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో ఇదే పీకేట్‌లో గన్ మిస్ ఫైర్ కావటంతో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా.. ఆర్ఎస్ఐ ప్రాణాలు కోల్పోవటం చర్చనీయాంశమైంది.