మరోవైపు పేరు మార్పుపై శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు
పేరు మారిస్తే గులాబీ జాతకం మారుతుందా అంటూ ప్రశ్నలు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
గులాబీ దళపతి కేసీఆర్ పార్టీ పేరును మళ్లీ టీఆర్‌ఎస్‌గా మారుస్తున్నారు. ఈ నెల 27న పేరు మార్చేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పేరు మార్చడం వల్లే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆదిగా చర్యలు చేపడుతున్నారు. కేసీఆర్ రాజకీయాల్లో సెంటిమెంట్లకు ఎపుడూ పెద్ద పీట వేస్తుంటారు.
ఇదిలా ఉంటే.. ప్రజలతో చేసేదే రాజకీయం. ప్రజలకు నచ్చిన వారికే పట్టం కడతారు. వారికే అందలం దక్కుతుంది. ఇది వాస్తవం. అయితే నేల విడిచి సాము చేసిన చందంగా సెంటిమెంట్లు పట్టుకుని కూర్చుంటారు కొందరు రాజకీయ నేతలు. కొన్ని సార్లు ఆ సెంటిమెంట్ల వల్ల మంచి ఫలితాలు వస్తే రావచ్చు. కానీ ఎపుడూ సెంటిమెంట్‌ను నమ్ముకోవడం మూర్ఖత్వమే అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.
తెలంగాణాలో బీఆర్‌ఎస్ ఓటమి పాలైంది. దానికి కారణాలు అందరికీ తెలుసు. పదేళ్ల పాలనలో అధినాయకత్వం అహంకార ధోరణి, అన్నింటా పెరిగిన కుటుంబ పెత్తనం, హద్దులు దాటిన అవినీతి వంటివెన్నో కారణాలు ఉన్నాయన్నది నగ్న సత్యం. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల దాకా అంతా అవినీతిమయం అన్నట్లుగా రాజ్యం సాగింది. దానికి విసిగిన జనాలు బీఆర్‌ఎస్ ని ప్రతిపక్షానికి పరిమితం చేశారు.
అయితే ఓటమి పాలై నాలుగు నెలలు గడచింది. అయినా ఓటమిపై ఆత్మ విమర్శ అయితే చేసుకోవడం లేదు. పైగా ఏవో ఇతర కారణాలను చెప్పుకుంటున్నారు. బీఆర్‌ఎస్ అధినీఅత కేసీఆర్ అయితే తాజాగా మీడియాతో మాట్లాడుతూ జస్ట్ 1.8 శాతం ఓట్ల శాతంతో ఓటమి పాలు అయ్యామని అన్నారు. తాము బలంగా ఉన్నామని చెప్పారు. సరే క్యాడర్ కి ధీమా నింపడానికి ఈ మాటలు అన్నా వాస్తవాలు చూసుకోవాలి కదా సరైన సమీక్ష జరగాలి కదా అని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పేరు మార్పు ఉంటుందని అంటున్నారు. అంటే పార్టీ పేరు మార్చడం పక్కా అనేది తేలిపోయింది. బీఆర్‌ఎస్‌ని 2022 అక్టోబర్ లో విజయదశమి వేళ పేరు మార్చారు. ఆనాటి నుంచి బీఅర్‌ఎస్ కి ఏ విధంగానూ కలసిరాలేదు అని గుర్తు చేసుకుంటున్నారు.
ఇక 2023 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. దాంతో తెలంగాణా ఆత్మగా ఏర్పాటు అయిన పార్టీ ఇపుడు అదే తెలంగాణా కోసం తపిస్తోంది అంటున్నారు. పేరు మార్చుకోవడం ద్వారా సెంటిమెంట్ ని మళ్లీ రగిల్చి అధికారంలోకి రావచ్చు అన్న లెక్కలు వేసుకుంటున్నారు. అయితే పార్టీ శ్రేణుల్లో మాత్రం పార్టీ పేరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేరు మారిస్తే లాభం ఏమిటని, నేతల తీరు మారాలని వారు అంటున్నారు.