ముఖ్యమంత్రి హోదా స్థాయిని దిగజార్చేలా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారన్నారు. రేవంత్ రెడ్డి మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు? అని ప్రశ్నించారు. బుధవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో పస లేదని ప్రజలు గుర్తించారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల ప్రచారాన్ని ప్రజలు నమ్మరని, ఆఖరికి ఫేక్ వీడియోలు సృష్టించే స్థాయికి రేవంత్‌రెడ్డి దిగజారారని విమర్శించారు. రాజ్యాంగాన్ని ధర్మ గ్రంథంగా చూస్తామని మోడీ, అమిత్ షా చెప్పారని అన్నారు. దాన్ని మార్చే ప్రసక్తే లేదని తమ పార్టీ అగ్రనేతలు చెప్పారని, అంబేడ్కర్‌ను అవమానించేలా రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. కాంగ్రెస్ నేతలే రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు లే..
ఆ పార్టీ రాజ్యాంగాన్ని మొదటి నుండి అవమానిచిందన్నారు. మతపరమైన విభజనకు కారణం నెహ్రూ అన్నారు. ఈ రోజు సెక్యులరిజం గురుంచి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే అని తెలిపారు. రాజ్యాంగాన్ని ఇందిరాగాంధీ అవమానించినట్టు ఎవరు అవమానించలేదని చెప్పుకొచ్చారు. చైనా లాంటి దేశ సహకారంతో మార్ఫింగ్ జరిగిందా? అని ప్రశ్నించారు. రేవంత్, కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నట్టు బయట పడుతుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో బీసీలకు 50 డివిజన్‌లు కేటాయిస్తే అందులో 31 మంది ముస్లింలు గెలిచారని పేర్కొన్నారు. బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. ఒక్క మాదిగకు సీటు ఇవ్వకుండా మీరు ఏ విధమైన సామాజిక న్యాయం పాటించారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.