తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే తాము రైతులందరికీ రైతు భరోసా అందజేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రైతాంగం అభివృద్ధి చెందేందుకు తాము అన్ని విధాలా సహకరిస్తామని, తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వమన్నారు. ఇప్పటికే రుణమాఫీ అమలు చేసి, తమ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు పట్టించుకునే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా సన్నాలకు అదనంగా 500 రూపాయలు ఇప్పటికే అందిస్తూ రైతులకు ఆర్థికంగా తాము చేయూతనందిస్తున్నామని, సంక్రాంతి తర్వాత రైతు భరోసా సైతం విడుదల చేస్తున్నట్లు సీఎం శుభవార్త చెప్పారు. ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో రైతు భరోసా అమలుకు తగిన విధి విధానాలపై చర్చిస్తామని, ఈ పథకం అమలుపై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తామన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ వరి సాగు చేస్తే ఉరే అంటూ ప్రకటించి, నేడు తాము తెలంగాణ రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతుంటే ఓర్వలేక సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం సాగిస్తున్నారన్నారు. అంతేకాదు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సన్న బియ్యంతో ఆహారాన్ని అందించేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నట్లు సీఎం అన్నారు. వ్యవసాయం దండగంటూ గత పాలకులు బహిరంగంగానే కామెంట్స్ చేశారని, తమ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం పండగలా జరుపుకునేలా రైతులకు అండగా నిలుస్తుందన్నారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ రూ.7 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందని సీఎం తెలిపారు. గతంలో అసెంబ్లీలో ప్రశ్నిస్తే విపక్షాలు అబద్ధాలు చెప్పాయని, అప్పులపై వాస్తవాలు బయటపడకుండా వ్యవహరించారన్నారు. అప్పులు, ఆస్తుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఉందని, మేం అధికారంలోకి రాగానే అన్ని అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని తెలిపారు. కేసీఆర్ ఎగ్గొట్టిన రైతుబంధును మేం అధికారంలోకి రాగానే విడుదల చేశామని మరోమారు సీఎం పునరుద్ఘాటించారు. రూ. 7625 కోట్ల బకాయిలను మొదటి విడతగా చెల్లించామని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.17,869 కోట్ల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.