బీఆర్‌ఎస్ నేతలకు టీజేఎస్ చీఫ్ కోదండరాం సవాల్
ప్రాజెక్టు ముమ్మాటికీ తెలంగాణకు గుదిబండే
కేసీఆర్‌ది దుర్మార్గమైన పాలన అంటూ తీవ్ర వ్యాఖ్యలు
దొంగే దొంగ అన్నట్లు బీఆర్‌ఎస్ వైఖరి ఉందని, టీజేఎస్ చీఫ్ కోదండరాం వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మూడు పిల్లర్లు కుంగిపోయిన మేడిగడ్డ పటిష్టంగా ఉందని చెప్పడం శుద్ధ తప్పన్నారు. ప్రణాళిక, నాణ్యత, నిర్వహణ, డిజైన్ లోపం వల్లే పిల్లర్లు కుంగిపోయాయన్నారు. మూడు పిల్లర్లే కదా కుంగిపోయిందని బీఆర్‌ఎస్ వితండవాదం చేయడం విడ్డూరమన్నారు. సాగు నీరు, ఇంజనీరు వ్యవస్థ సంక్షోభానికి గురైందన్నారు. ఫామ్ హౌస్ ప్రయోజనాల కోసం కేసీఆర్ ఇలాంటి పనులు చేశారని మండిపడ్డారు. మార్చిన డిజైన్‌లకు సీడబ్ల్యుసీ అనుమతి తీసుకోలేదన్నారు.
పంప్ హౌస్‌ల లోకేషన్ మార్చండి లేకపోతే మునిగిపోతాయని సీడబ్ల్యుసీ హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదని… భవిష్యత్తులో కూడా చూడలేమన్నారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారన్నారు. బీఆర్‌ఎస్ నేతలు మేడిగడ్డ సందర్శనకు వెళ్ళడం అంటే తమ తప్పులను తామే అద్దంలో చూసుకోవడమే అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం తప్పిదాలపై బీఆర్‌ఎస్ బహిరంగ చర్చకు సిద్దమా? అని సవాల్ విసిరారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మార్చి 10న చర్చకు రావాలన్నారు. బీఆర్‌ఎస్ చర్చకు తెర లేపిందని… చర్చకు టీజేఎస్ ముగింపు ఇస్తుందన్నారు. ఊరు ఊరు తిరిగి బీఆర్‌ఎస్ బండారం బట్టబయలు చేస్తామన్నారు. కాళేశ్వరం కామధేను ఎట్లా అయితుందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కామధేను కాదు తెలంగాణ పాలిట గుదిబండ అంటూ కోదండరాం విరుచుకుపడ్డారు.