గుప్పుమన్న గంజాయ్.. పోలీసుల దాడులు
(అమ్మన్యూస్, హైదరాబాద్)
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొంతమంది కలిసి రేవ్ పార్టీని నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీని భగ్నం చేసి 18 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి టీఎన్జీఎస్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో.. బర్త్డే సందర్భంగా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రేవ్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ పార్టీలో గంజాయి, ఈ సిగరెట్లు తదితర నిషేధిత పదార్థాలను విచ్చలవిడిగా వినియోగించినట్లు పేర్కొంటున్నారు.
పక్కా సమాచారంతో దాడి చేసిన మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు.. అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఆరుగురు యువతులు, 12 మంది యువకులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి 45 గ్రాముల గంజాయి ప్యాకెట్లు, ఈ సిగరెట్లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించినట్లు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని గచ్చిబౌలి పోలీసులు వివరించారు.