జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లో రసాభాస చోటు చేసుకుంది. గతంలో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న.. జీహెచ్‌ఎంసీ ప్రస్తుతం అప్పుల పాలు అయ్యిందని.. ఇందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే (BRS) కారణమని బీజేపీ , కాంగ్రెస్ కార్పొరేటర్లు వ్యాఖ్యలు చేశారు. అయితే వారిని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. మేయర్ పొడియంను బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు చుట్టుముట్టారు. జీహెచ్‌ఎంసీ సమావేశంలో ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అన్న చందంగా చర్చ జరిగింది. గ్రేటర్ హైదరాబాద్‌లో యాడ్స్ అన్నీ ఆంధ్ర కాంట్రాక్టర్స్‌కే ఇచ్చారని బీజేపీ వ్యాఖ్యలు చేసింది. అయితే హైదరాబాద్‌లో ఆంధ్ర వాళ్ళు ఉండవద్దా అని మేయర్ విజయలక్ష్మి ప్రశ్నించారు.
మేయర్ ఆగ్రహం…
మరోవైపు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై మేయర్ సీరియస్ అయ్యారు. జీహెచ్‌ఎంసీ అభివృద్ధి కోసం పనిచేసే అధికారులే ఇక్కడ ఉండాలన్నారు. సిన్సియర్‌గా పనిచేసే ఆలోచన అధికారులకు లేకపోతే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కమిషనర్‌కు మేయర్ ఆదేశాలు ఇచ్చారు. నిర్లక్ష్యంగా ఉండే అధికారులను వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని మేయర్ విజయలక్ష్మి సూచించారు. కాసేపటి తర్వాత జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం ప్రశ్నోత్తరాలు – మధ్యాహ్నం బడ్జెట్‌పై చర్చించి.. కౌన్సిల్ ఆమోదం తెలుపనుంది.