జమిలి ఎన్నికల ప్రతిపాదన 2029-30లో పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చిన తర్వాత ఏదో ఒక ఎన్నిక కోసం ఓటర్లు ప్రతి ఏడాది పోలింగ్ బూత్‌కు వెళ్లాల్సిన పని ఉండదని మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. ఒకేసారి ఎన్నికలు ప్రతిపాదన కార్యరూపం దాల్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియకు అది మరింత ఊతమిస్తుందన్నారు. తద్వారా దేశాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తరుణంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ఓట్ల కోసం ప్రతి సంవత్సరం నేతలు రావడం పట్ల ప్రజలు విసిగిపోయారన్నారు. తరుచూ అలాంటి పరిస్థితిని ప్రజలు కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. జమిలి ఆర్థికాభివద్ధికి దోహదం చేస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న జీడీపీకి అదనంగా మరో 1.5 శాతం పెరుగుతుందన్నారు.
తద్వారా భారత్ ప్రపంచ మూడో లేదా నాలుగో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు. జమిలి ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ చైర్మన్‌గా అనేక రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమయ్యానని వెల్లడించారు. ఇందుకు సంబంధించి 18 వేల పేజీల నివేదిక అందరికీ అందుబాటులో ఉందన్నారు. గ్రంథాలయాలకు వెళ్లకుండానే ఒక మౌస్ క్లిక్‌తో వాటన్నింటిని చూడవచ్చన్నారు.