తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. రాష్ట్రంలో మూడు స్థానాల రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్ రెండు స్థానాలు దక్కగా.. బీఆర్‌ఎస్‌కు ఒక్క స్థానం దక్కింది. కాంగ్రెస్ తరుపున రెండు స్థానాలకు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌లకు అవకాశం దక్కిది. మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్రకు దక్కింది. రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేంద్ర రెడ్డి వారికి ధృవీకరణ పత్రం అందజేయనున్నారు. ఇక రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో తెలంగాణ నుంచి బడుగుల లింగయ్య యాదవ్, జోగినిపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్రలు రిటైర్డ్ అవ్వనున్నారు.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల నామినేషన్ల ఫిబ్రవరి 15తో గడువు ముగియగా.. మొత్తం ఐదు నామినేషన్లు వచ్చాయి. ఇందులో రెండు నామినేషన్లు సాంకేతిక కారణాలతో తిరస్కరించారు. ఇక కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్.. బీఆర్‌ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్రలు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు గడువు కూడా ముగిసింది. దీంతో మూడు స్థానాలకు మూడు నామినేషన్లు రావడంతో రాజ్యసభకు ఏకగ్రీవం అయినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు.