మరణానంతరం తాను తన అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్. ప్రజలందరూ ఈ విషయంలో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మన దేశంలో ఎవరైనా మరణించిన తర్వాత వారి దేహాలను ఖననం లేదా దహనం చేస్తుంటారని, అలా చేసేముందు వారి శరీరంలో ముఖ్యమైన అవయవాలను దానం చేస్తే మరో 8 మంది ప్రాణాలను బతికించవచ్చని సజ్జనార్ తెలిపారు. కామినేని ఆస్పత్రి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సోమవారం (ఆగస్టు 8) అవయవదాన అవగాహన ప్రచారం కార్యక్రమాన్ని సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అవయవదానంపై ప్రతిజ్ఞ చేసిన సజ్జనార్.. అనంతరం కీలకోపన్యాసం చేశారు.
ప్రజలందరూ అవయవదాతలుగా మారాల్సిన అవసరం ఉందని వీసీ సజ్జనార్ పిలుపునిచ్చారు. ‘అవయవాల కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం గత సంవత్సరం దేశంలో 18,378 ఆర్గాన్ డొనేషన్లు అయితే, వాటిలో లైవ్ డొనేషన్లు 15,436, కెడావర్ డొనేషన్లు 2,942 ఉన్నాయి. లైవ్ డొనేషన్లలోనూ అత్యధికం అంటే.. దాదాపు పదివేలకు పైగా మహిళలే చేశారు. మూడోవంతు మాత్రమే పురుషులు ఉన్నారు. దేశంలో ఒక ట్రాన్స్‌జెండర్ కూడా అవయవదానం చేయడం విశేషం. ఈ గణాంకాలను గమనిస్తే.. మాతృప్రేమ ఇందులో స్పష్టంగా తెలుస్తోంది’ అని సజ్జనార్ వివరించారు.
‘10 సంవత్సరాల క్రితం 4,490 మంది మాత్రమే అవయవదానాలు చేశారు. ఇప్పుడు ఇంత పెరగడానికి వివిధ ఆస్పత్రులు, ప్రభుత్వాలు చేస్తున్న అవగాహన కార్యక్రమాలే కారణం. డాక్టర్ స్వర్ణలత లాంటివాళ్లు జీవన్‌దాన్ ద్వారా ఎంతో కృషి చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలామంది వైద్యులు అవయవ మార్పిడి ఆపరేషన్లలో ఎంతో ముందున్నారు. వారందరికీ నా అభినందనలు’ సజ్జనార్ అన్నారు.
ఏటా ఆగస్టు 13వ తేదీని ప్రపంచ అవయవదాన దినోత్సవంగా నిర్వహిస్తారు. దీనిపై ఉన్న అపోహలను తొలగించి, మరింత మందిని ఈ దిశగా ప్రోత్సహించేందుకు, అవయవదానంపై అవగాహన కల్పిచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కామినేని ఆస్పత్రుల సీఓఓ గాయత్రీ కామినేని మాట్లాడుతూ.. సజ్జనార్‌కు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ స్ఫూర్తినిచ్చారని సజ్జనార్‌ను కొనియాడారు.
‘ఇక్కడ అనేక మంది రోగులు తమకు జీవితంలో లభించే సెకండ్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు 14 వేల మందికి పైగా రోగులు అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే మనమంతా స్పందించాలి. ఈ ఉద్దేశంతోనే అవయవదాన ప్రతిజ్ఞ కార్యక్రమం ప్రారంభించాం. ప్రతి ఒక్కరూ తమ పేర్లు నమోదు చేసుకుని, ఇక్కడ ఉన్నవారికి ఒక ఆశ కల్పించాలి’ అని గాయత్రీ కామినేని అన్నారు.