ప్రజాపాలనలో పోలీస్‌స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు తయారవుతున్నాయని.. పోలీస్‌స్టేషన్‌లో కాదంటూ సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద ఆయనను పోలీసులు అరెస్టు చేసి గచ్చిబౌలి పీఎస్‌కు తరలించారు. రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు ఆయనను విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ఈ రోజు రాష్ట్రంలో చూస్తే రేవంత్ మార్పు మార్పు అన్నడు. ఆయన తెచ్చిన మార్పు ఏమన్న ఉందంటే.. ఈ రాష్ట్రంలో నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప ఆయన తెచ్చిన మార్పు లేదు. ఏ నిరుద్యోగ యువతకు అయితే మాట ఇచ్చారో.. ఆ యువతను అశోక్‌నగర్‌లో వీపులు కమిలిపోయేలా కొట్టారు. గిరిజనులకు ఏ గొప్పగొప్ప మాటలు చెప్పారో.. అర్ధరాత్రిపూట వారిపై దాడి చేసి.. ఈ రోజుకూడా గిరిజనులను జైల్లో నిర్బంధించారు. రేవంత్ పాలన ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నది. పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందుపడలేదు. పోలీసులను అతిగా ప్రయోగించిన ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదు’ అన్నారు.
ప్రతిపక్షాల గొంతునొక్కాలనే ప్రయత్నం..
‘ఇందిరమ్మలాంటి వాళ్లను సైతం కూకటివేళ్లతో పెకిలించిన దేశం ఈ భారతదేశం. ఇవాళ రేవంత్‌రెడ్డి కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతునొక్కాలని.. ప్రశ్నించే గొంతునొక్కాలని రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నడు. ఇవాళ పోలీస్‌స్టేషన్‌లు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారినయ్. ఎఫ్‌ఐఆర్‌లు పోలీస్‌స్టేషన్లలో తయారవతలేవు. గాంధీ భవన్‌లో ఎఫ్‌ఐఆర్‌లో తయారవుతున్నయ్. ఏ సెక్షన్లు పెట్టాలి.. ఎవరిని అరెస్ట్ చేయాలో.. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీభవన్ నుంచి ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి ఉన్నది. పోలీసులు ఉన్నతాధికారులు ఒక విషయం ఆలోచించుకోవాలి. రేవంత్‌రెడ్డి ఏం శాశ్వతం కాదు. ఆయన ఇవాళ ఉంటడు.. రేపు పోతడు. మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. మరో ప్రభుత్వం రావొచ్చు. కానీ, పోలీసులు ఓ విషయం గుర్తుంచుకోవాలి. చట్టం, రాజ్యాంగానికి లోబడి పని చేయాలి తప్పా.. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పని చేస్తే మీరు ఇబ్బందిపడుతారు. చట్టం, రాజ్యాంగం శాశ్వతంగా ఉంటది. రేవంత్‌రెడ్డి ఏం శాశ్వతంగా ఉండడు’ అంటూ చురకలంటించారు.