– వేడుకగా మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి తనయుని వివాహ రిసెప్షన్
– భారీగా తరలొచ్చి లోహిత్ రెడ్డి- భవాని దంపతులను దీవించిన ప్రజానీకం
– అతిథులను ఆకట్టుకున్న ‘ పీఎస్ఆర్ ప్యాలెస్’ సెట్టింగ్
– హాజరైన మంత్రులు భట్టి, కోమటి రెడ్డి, తుమ్మల, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు
కల్లూరు : ఐదెకరాల్లో ‘పీఎస్ఆర్ ప్యాలెస్’ సెట్టింగ్…. ఇరవై ఐదు ఎకరాల్లో నోరూరించే వెజ్, నాన్ వెజ్ వంటకాలతో భోజన ఏర్పాట్లు….. మరో నలభై ఎకరాల్లో వాహనాల పార్కింగ్…. మొత్తంగా 70 ఎకరాల్లో జరిగిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి తనయుని వివాహ రిసెప్షన్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వారి స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో జరిగిన ఈ వేడుకకు ఉమ్మడి ఖమ్మంజిల్లా వ్యాప్తంగానే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలొచ్చి లోహిత్ రెడ్డి భవాని దంపతులను దీవించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి – మాధురి దంపతులు ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి- శ్రీలక్ష్మి దంపతులు వేడుకకు విచ్చేసిన వారినిఅతిథి మర్యాదలతో ఆహ్వానించారు. మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయి, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వివిధ వ్యాపార, వాణిజ్య రంగ ప్రముఖులు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని నూతన వధూవరులను దీవించారు.
– ఆకట్టుకున్న ‘పీఎస్ఆర్ ప్యాలెస్ ‘ సెట్టింగ్…!
వధూవరులు ఆసీనులయ్యే వేదికను ఐదు ఎకరాల్లో సువిశాలంగా మలిచారు. పీఎస్ఆర్ ప్యాలెస్ పేరుతో రాజభవనం ఆకృతిలో భారీ సెట్టింగ్ వేశారు. హిందూ సంప్రదాయం ఉట్టిపడేలా, ఆధ్యాత్మిక గోపుర నమూనాలో తీర్చిదిద్దిన ఈ భారీ సెట్టింగ్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ భవనానికి ఇరువైపులా కొండల మీది నుంచి జలపాతం జాలువారేలా, సహజసిద్ధంగా ఉండేలా మలచడం విశేషం. వీటితో పాటు.. ప్రత్యేక స్టాళ్లు, పచ్చని పూదోటలు, ఫౌంటెన్లు ఇలా అనేకం.. ఈ విశాల ప్రాంగణంలో ఆహ్లాదాన్ని పంచాయి.
– ఆహా ఏమిరుచి…!
వేడుకకు విచ్చేసిన అతిథులకు మొత్తంగా 12 స్టాళ్లను ఏర్పాటు చేసి విందు భోజనం పెట్టారు. పది స్టాల్లు నాన్ వెజ్, ఒక స్టాల్ వెజ్, మరో స్టాల్ వీఐపీ ల కోసం ఏర్పాటు చేశారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యల వేపుడు, తందూరి చికెన్, మటన్ కర్రీ, గోంగూర బోటీ, యాట తలకాయ కూర.. రుమాలీ రోటీ.. ఇలా పలు రకాల నోరూరించే వంటకాలు విచ్చేసిన వారికి వడ్డించారు. భోజనం తర్వాత నాలుగు రకాల ఐస్ క్రీములు, సీతాఫల్ జ్యూస్, డబుల్ కా మీఠా, స్వీట్ ఖిల్లీ ఏర్పాటు చేసి అందరికీ పసందైన భోజనాన్ని అందించారు.
– ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లు…
వేడుకగా వేలాదిగా ప్రజానీకం తరలివస్తారని ముందుగానే అంచనా వేసి అందుకు తగినట్లుగా ఏర్పాట్లును చేశారు. పార్కింగు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లును చేశారు. ఏసీపీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాట్లును పర్యవేక్షించారు. ప్రథమ చికిత్స కేంద్రం, ఫైర్ సర్వీస్ ఇలా భద్రత పరమైన అన్ని జాగ్రత్తలను తీసుకోని వేడుకలను సజావుగా నిర్వహించారు.