రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్ని సందర్శించిన రాష్ట్ర మంత్రులు.. అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రాష్ట్రంలో అమలు చేయనున్న ఉమ్మడి డైట్ చార్టును విడుదల చేసి విద్యార్థులకు సంతోషాన్ని కలిగించారు. ఈ సందర్భంగానే మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన పొంగులేటి తన పెద్ద మనసు చాటుకున్నారు. నిరుపేద విద్యార్థి బాధలు విన్న మంత్రి.. అక్కడికక్కడే స్పందించారు. ఓ నిరుపేద చిన్నారికి పట్టలేని సంతోషాన్ని అందించి.
గురుకులాల్లో మంత్రుల పర్యటనల నేపథ్యంలో మహబూబా బాద్ జిల్లాలోని మరిపెడ సోషల్ వెల్ఫేర్ పాఠశాలను మంత్రి పొంగులేటి సందర్శించారు. అక్కడే కామన్ డైట్ చార్ట్ ను విడుదల చేసి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగానే.. ఓ విద్యార్థికి, పొంగులేటికి మధ్య జరిగిన సంఘటన అందరినీ ఆకట్టుకుంది. వారిద్దరి మధ్య సరదాగా సాగిన సంభాషణ, హృద్యంగా మారిన తీరు.. మంత్రి స్పందించిన తీరు.. అందరితో చప్పట్లు కొట్టించేలా చేశాయి.
నేను పొంగులేటి అభిమానిని..
పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటిస్తున్న పొంగులేటి దగ్గరకు శరత్ అనే ఓ విద్యార్థి వచ్చాడు. తాను.. పొంగులేటికి పెద్ద వీరాభిమానినంటూ ఆనందంతో చెప్పాడు. ఆ విద్యార్థి ముఖంలో ఆనందం చూసి మురిసిపోయిన పొంగులేటి.. విద్యార్థిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. అతని ఆనందానికి సంబరపడిపోతూ.. తన దగ్గరున్న పెన్నును విద్యార్థికి అందించారు. దాంతో ఉద్వేగానికి లోనైన శరత్.. కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో.. కదిలిపోయిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. విద్యార్థితో కాసేపు ముచ్చటించారు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు..
మాటల సందర్భంగా తనకు ఉండేందుకు ఇల్లు లేదని తెలిపిన శరత్.. తన తల్లిదండ్రులు పూరి గుడిసెలో ఉంటూ తనను చదివిస్తున్నారని ఆవేదనగా చెప్పాడు. తనకోసం కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాంతో.. వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విద్యార్థికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని నిర్ణయించుకున్నారు. తనతో పాటుగా వచ్చిన జిల్లా కలెక్టర్ ను పిలిచి.. ఈ విద్యార్థి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాల్సిందిగా ఆదేశించారు.
విద్యార్థితో సరదాగా ప్రారంభమైన మంత్రి ముచ్చట.. చివరికి ఈ విద్యార్థి కుటుంబానికి కొండంత అండగా మారడంతో శరత్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. స్వయంగా మంత్రే తనకు పెన్ను గిఫ్ట్ గా ఇవ్వడం, ఇల్లు లేదని తెలుసుకుని ఇల్లు మంజూరు చేయడంతో.. తన కుటుంబానికి చాలా వరకు కష్టాలు తప్పాయని సంబరపడిపోతున్నారు. ఈ ఘటన చూసిన వారంతా.. మంత్రి పొంగులేటి పనికి మెచ్చుకుంటూ, ప్రశంసిస్తున్నారు.