ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నెలకో జిల్లా చొప్పున పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఏడాది నుంచి జనం మధ్యకు వెళ్లేలా పవన్ ప్రణాళికలు చేసుకున్నారు. జిల్లాల్లోని సమస్యలు, ప్రజల స్థితిగతులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా పరిశీలించేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రజలతో నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారు. ఆయా జిల్లాల్లో వెనుకబడిన, గ్రామీణ ప్రాంతాల్లో క్యాంప్ చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. తన కార్యాలయ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.
కాగా పవన్ కల్యాణ్ శనివారం కడప జిల్లాలో బిజీ బిజీగా ఉన్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఎంపీడీవోను పరామర్శించి వైసీపీ నేతల దాడికి సంబంధించి బాధితుడిని, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుడు ఎంపీడీఓ జవహర్ బాబుకు, కుటుంబసభ్యులకు ‘‘ నేనున్నాను.. ధైర్యంగా ఉండమని’’ పవన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఉపముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదని మండిపడ్డారు. ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎంపీడీఓ జవహర్ బాబును అమానుషంగా కొట్టారని.. జవహర్ బాబుకు హైబీపీతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఎవరి మీదైనా దాడి చేస్తే వైసీపీ ప్రభుత్వంలా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా అధికారులపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఘటనా స్థలానికి సీఐ వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్ కాలేదని అన్నారు. అహంకారంతో దాడి చేస్తే తోలు తీసి కూర్చోపెడతామని హెచ్చరించారు.