AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రముఖ తబలా ప్లేయర్ జాకీర్ హుస్సేన్ ఇక లేరు

భారతదేశం గర్వించదగ్గ సంగీత కళాకారుడు, ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జాకీర్ హుస్సేన్ అమెరికాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో భారత శాస్త్రియ సంగీత రంగంలో విషాదం అలముకుంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జాకీర్ హుస్సేన్ మృతిని నిర్ధారించింది. ఆయన గత కొంతకాలంగా హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. “వహ్ తాజ్” అంటూ అప్పట్లో ఆయన నటించిన తాజ్ మహల్ టీ యాడ్ ఎంతోమందిని అలరించింది.

పద్మభూషణ్, గ్రామీ అవార్డు విజేత జాకీర్ హుస్సేన్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, వైసీపీ అధినేత జగన్ సంతాపం తెలియజేశారు. తబలా మ్యాస్ట్రో జాకీర్ హుస్సేన్ మృతి విషాదం కలిగిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భారత శాస్త్రియ సంగీతం రంగంలో ఆయన శిఖర సమానుడని కీర్తించారు. సంగీత ప్రేమికులను ఆయన తన తబలా ప్రదర్శనలతో సమ్మోహితులను చేశారని, అనేక తరాల సంగీత ప్రేమికులను స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడారు. సంగీత ప్రపంచంలో ఆయన వారసత్వం కొనసాగుతుందని ఆశిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఇక, ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్… జాకీర్ హుస్సేన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచం ఒక ప్రకాశవంతమైన దిగ్గజాన్ని కోల్పోయిందని తెలిపారు. ఆయన తన అసమాన నైపుణ్యంతో ప్రపంచ సంగీత ప్రేమికులను కట్టిపడేశారని కొనియాడారు. అటువంటి సంగీత జ్ఞాని మృతి పట్ల కోట్లాది అభిమానులతో కలిసి తాను కూడా విచారిస్తున్నానని తెలిపారు.

వైసీపీ అధినేత జగన్ స్పందిస్తూ… తబలా మ్యాస్ట్రో జాకీర్ హుస్సేన్ ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురైనట్టు తెలిపారు. భారత శాస్త్రియ సంగీత రంగంపై చెరగని ముద్రవేశారని, ఆయనొక దిగ్గజ సంగీతకారుడని కీర్తించారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని జగన్ ట్వీట్ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10