జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేదం ఉంటుందని సీఈవో వికాస్ రాజ్ అన్నారు. ఎల్లుండి అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్‌కు సమయం మరింత దగ్గరపడినందున నిఘా మరింత పెరుగుతుందన్నారు. ప్రచార సమయం ముగిసిన తర్వాత నియోజకవర్గాల్లో ఇతర వ్యక్తులు ఉండకూదన్నారు. బందోబస్తు కోసం రాష్ట్రానికి 160 కేంద్ర బలగాలు వచ్చాయని, 60 వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారని తెలిపారు. పోలింగ్ విధుల్లో దాదాపు 90 వేల మంది ఉద్యోగులు పాల్గొంటారని వెల్లడించారు. తనిఖీల్లో ఇప్పటి వరకు రూ. 320 కోట్ల సొమ్మను స్వాధీనం చేస్తున్నామని, అలాగే 8 వేలకు పైగా కేసులు అయినట్లు తెలిపారు. సీ విజన్, టోల్ ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫిర్యాదులు అందిన వంద నిమిషాల్లోనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ సైట్‌ల్లో రాజకీయ ప్రకటనలు ఇవ్వకూదని వికాస్ రాజ్ సూచించారు.