AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇకపై నో బెనిఫిట్‌ షోలు.. సినీ ప్రముఖులకు తేల్చిచెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి

టికెట్ల పెంపునకు అనుమతి ఇచ్చేది లేదు
అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే
బౌన్సర్ల విషయంలోనూ సీరియస్‌..
‘తగ్గేదేలేదు.. టికెట్ల పెంపు, బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వబోం.. శాంతి భద్రతల విషయంలోనూ రాజీపడే ప్రసక్తే లేదు.. అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే.. ఇకపై బౌన్సర్లపై విషయంలో సీరియస్‌గా ఉంటాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో టాలీవుడ్‌ సినీ ప్రముఖులు గురువారం సమావేశమయ్యారు. బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(సీసీసీ)లో ముఖ్యమంత్రితో టాలీవుడ్‌ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సినీనటులు నాగార్జున, వెంకటేశ్, నితిన్, కిరణ్‌ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ.. దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్‌ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్, హరీశ్‌ శంకర్, ప్రశాంత్‌ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట.. నిర్మాతలు దిల్‌ రాజు, అల్లు అరవింద్, సురేశ్‌ బాబు, సుధాకర్‌ రెడ్డి, సి.కల్యాణ్, గోపి ఆచంట, శ్యాంప్రసాద్‌ రెడ్డి, బీవీఎస్‌ ప్రసాద్, కె.ఎల్‌.నారాయణ, మైత్రీ రవి, నవీన్‌.. సీఎంతో భేటీ అయ్యారు. మెుత్తం 36 మంది సభ్యులు రేవంత్‌తో సమావేశమై సినిమా టికెట్‌ రేట్లు, బెన్‌ ఫిట్‌ షోలు, సంధ్యా థియేటర్‌ ఘటన వంటి పలు పలు అంశాలపై చర్చించారు.

అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాం..
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవని సినీ పరిశ్రమ పెద్దలకు సీఎం రేవంత్‌ రెడ్డి తేల్చి చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన మాటకే తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదని ఆయన సినీ పెద్దలకు స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామని చెప్పారు. అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే తేల్చి చెప్పారు. చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సినీ పరిశ్రమ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలని.. డ్రగ్స్‌ క్యాంపెయిన్‌ , మహిళా భద్రత వంటి క్యాంపెయిన్లలో చొరవ చూపాలని సీఎం వారికి సూచించారు. టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్‌ చేయాలని స్పష్టం చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

సినీ ప్రముఖుల రియాక్షన్స్‌ ఇలా…
సీఎం రేవంత్‌ రెడ్డితో సమావేశం అనంతరం సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘అందరు సీఎంలు సినిమా ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది. దిల్‌ రాజును ఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నా. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్‌ స్పాట్‌లు ఉన్నాయి. ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో చేశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరామని’ చెప్పారు.

నటుడు నాగార్జున మాట్లాడుతూ..‘ప్రభుత్వం క్యాపిటల్‌ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్‌ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్‌ వరల్డ్‌ సినిమా క్యాపిటల్‌ కావాలనేది మా కోరిక. యూనివర్సల్‌ లెవెల్‌లో స్టూడియో సెటప్‌ ఉండాలి అని అన్నారు.

నటుడు మురళీ మోహన్‌ మాట్లాడుతూ..‘ఎలక్షన్స్‌ రిజల్ట్‌ లాగానే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుంది. సంధ్య థియేటర్‌ ఘటన మమ్మల్ని బాధించింది. సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్‌ వల్లే ప్రమోషన్‌ కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్‌ ఉండడం వల్ల ప్రమోషన్‌ విస్తృతంగా చేస్తున్నాం’ అని అన్నారు.

నిర్మాత దగ్గుబాటి సురేశ్‌ బాబు బాట్లాడుతూ.. ‘ తెలంగాణ ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ డెస్టినేషన్‌ చేయాలనేది మా డ్రీమ్‌. ప్రభుత్వ సాయంతోనే ఆ రోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్‌ కేరాఫ్‌గా ఉండాలి’ అని అన్నారు.

దర్శకుడు త్రివిక్రమ్‌ మాట్లాడుతూ.. ‘మర్రిచెన్నారెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు వల్లే సినీ పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చింది. ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా సీఎం రేవంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. సంధ్య థియేటర్‌ ఘటనపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే  ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందని సీఎం చెప్పారు’ అని అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10