VIPలు బస్సుల్లో రావాలి: మంత్రి పొంగులేటి కీలక సూచన
తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతరకు సర్వం సిద్ధమైంది. ఈనెల 21 నుంచి 24 వరకు జరిగే జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడారం వచ్చేందుకు ప్రత్యేకంగా బస్సులు, ట్రైన్లతో పాటు హెలికాప్టర్ ప్రయాణ సదుపాయాన్ని కూడా కల్పించారు. మేడారం జాతర ఏర్పాట్లను ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరో మంత్రి సీతక్కతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పొంగులేటి జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా.. అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.
మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల నుంచి సరిపడా స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 17 కోట్ల మంది మహిళలు జీరో టికెట్‌తో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని.. మేడారం జాతరకు వచ్చే మహిళలకు కూడా బస్సుల్లో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. జాతర జరుగుతున్న ప్రాంతంలో చెత్తా చెదారం పేరుకుపోకుండా ఎక్కువ మంది పారిశుధ్య కార్మికులను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. మేడారం జాతరలో పర్యవేక్షణ కోసం ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులను నియమించామని చెప్పారు.
ఈ క్రమంలో జాతరకు వచ్చే వీఐపీలకు మంత్రి పొంగులేటి కీలక సూచన చేశారు. తమ వాహనాలను ములుగులోనే పార్క్ చేసి ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సుల్లో మేడారానికి రావాలని పిలుపునిచ్చారు. తద్వారా ట్రాఫిక్ సమస్య తలెత్తదని.. వీఐపీలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకునే అవకాశం ఉండదని అన్నారు. భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారుల దృష్టి తీసుకురావాలని తెలిపారు. రానున్న నాలుగు రోజుల్లో దాదాపు 2 కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. జాతర సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ బడ్జెట్‌ను కేటాయిస్తున్నామని పొంగులేటి స్పష్టం చేసారు.