చెరువులను చెరబట్టిన వారిని వదిలే ప్రసక్తేలేదు
ఎంతటి బడాబాబులైనా వదలం
సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్
హైడ్రాపై మరోసారి కీలక వ్యాఖ్యలు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ చెరువులను ఆక్రమించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. చెరువులను ఆక్రమణల నుంచి విడిపించేందుకే హైడ్రా ఏర్పాటు చేశామని రేవంత్ అన్నారు. బుధవారం తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన ప్రాసింగ్ అవుట్ పరేడ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా హైడ్రా గురించి మాట్లాడారు. ‘1908లో హైదరాబాద్ మహానగరంలో వరదలు ఉప్పెనలా కమ్మేసి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి నిజాం సర్కార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆర్కిటెక్ గా నియమించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి హైదరాబాద్ నగరానికి తాగునీటి సౌకర్యం కల్పించింది. ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూ ఆక్రమించి ధనవంతులు ఫామ్ హౌస్‌లు కట్టుకున్నారు. వాళ్ల ఇళ్ల నుంచి వచ్చే డ్రైనేజీ గండిపేట నీళ్లలో కలిస్తే.. ఆ నీళ్లు తాగడానికి నగర ప్రజలకు ఇస్తున్నారు.. వాటిని అడ్డుకోకుంటే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్లుగా కాదా?’ అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
అడ్డగోలుగా నిర్మాణాలు..
చెరువులను ఆక్రమించి అడ్డగోలుగా నిర్మాణాలు చేయడం వల్ల వరదలు వచ్చి పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నాయి. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశామని రేవంత్ చెప్పారు. చెరువులను ఆక్రమించి ఇల్లు నిర్మించినోళ్లు ఎంత పెద్దోళ్లయినా నిర్మాణాలు కూల్చకుండా వదిలిపెట్టేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ‘ఆక్రమించుకున్న చెరువులను మీరే వదిలిపెట్టి గౌరవంగా పక్కకు తప్పుకోండి.. నీటిపారుదల శాఖకు అప్పగించండి. మీరు ఖాళీచేయనంటే ఉన్నపళంగా నేలమట్టం అవుతాయి. కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో, నాలాల్లో అక్రమంగా నిర్మాణాలను మేం తొలగిస్తాం. మీరు కోర్టులకు వెళ్లినా.. కోర్టుల్లో కొట్లాడతాం. మీ ఆక్రమణలను తొలగిస్తామని రేవంత్ స్పష్టం చేశారు.
మూసీ ప్రక్షాళన చేసి తీరుతా..
కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూసీ ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అద్భుతమైన మూసీ డవలప్ మెంట్ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేస్తాం.. పేదవాళ్లకు అక్కడ వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నరు.. రూపాయిరూపాయి కూడబెట్టి గుడిసెలు వేసుకొని ఉన్నరు. వారిపట్ల ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరిస్తుంది. మూసీ నాలాలో ఉన్న శాశ్వత నివాసదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 11వేల మందికి అక్కడ ఇళ్లు ఉన్నాయి.. ప్రతివారికి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చి వారికి ఇబ్బందిలేకుండా చూస్తామని రేవంత్ పేర్కొన్నారు.