AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పేర్లు మార్చి పైసలు కొట్టేశారు: మంత్రి ఉత్తమ్ ఫైర్

కాంగ్రెస్ గతంలో ప్రతిపాదించిన అనేక నీటి పారుదల ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం గందరగోళం చేసిందని, కేవలం పాత పేర్లు మార్చి వేల కోట్ల అవినీతికి పాల్పడిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మంగళవారం జలసౌధలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కుదేలైన ఇరిగేషన్ శాఖను గాడిన పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి వివరించారు.

కొత్త ఆయకట్టు ఏదీ?
బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ శాఖ తరపున రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేశారని, కానీ ఖర్చుకు తగిన స్థాయిలో కాకున్నా కనీస స్థాయిలో ఆయకట్టు పెంచలేకపోయారని మంత్రి పేర్కొన్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టి లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.27 వేల కోట్లు, సీతారామ ప్రాజెక్టుకు రూ.7,436 కోట్లు ఖర్చు చేసిన అప్పటి ప్రభుత్వం ఒక్క ఎకరాకీ నీళ్లు ఇవ్వలేదు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నా.. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌ పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. కాంగ్రెస్‌ వచ్చాక పెండింగ్ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాం. పాత ప్రాజెక్టులన్నీ అదే పేరుతో పూర్తి చేస్తే, కాంగ్రెస్‌‌కు పేరు వస్తుందనే కారణంతో రీడిజైన్‌ చేసి ఖర్చు నాలుగింతలు పెంచారు’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ చేపట్టిన రాజీవ్, ఇందిరా ఎత్తిపోతలకు సుంకిశాలగా పేరు మార్చి రీ డిజైన్ చేశారని చెప్పారు.

రేపే సీతారామ ఓపెనింగ్..
రేపు ఖమ్మం జిల్లాల రైతాంగానికి చరిత్రాత్మకమైన రోజు అని, ముఖ్యమంత్రి చేతుల మీదగా సీతారామ ప్రాజెక్టు 3 పంపులను ప్రారంభించనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2026 ఆగస్టు 15 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. వై.ఎస్‌ హయాంలో రాజీవ్‌సాగర్‌, ఇందిరాసాగర్‌ ప్రాజెక్టు చేపడితే, బీఆర్ఎస్ ప్రభుత్వ నేతలు కమీషన్ల కోసం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టారు. వాటిని యధాతథంగా కొనసాగిస్తే.. కేవలం రూ. 3500 వేల కోట్లతో 6 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవని, కమీషన్ల కోసమే 18 వేల కోట్లకు అంచనాలు పెంచి సీతారామ ప్రాజెక్టు పేరుతో దానిని రీడిజైన్ చేశారన్నారు.

ఖమ్మం గుమ్మం తొక్కనీయం: మంత్రి పొంగులేటి ఫైర్
కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నెరవేర్చుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీతారామ ప్రాజెక్టుకు రూ.18,231 కోట్లు వెచ్చించాల్సి ఉండగా, రూ. 7230 కోట్లు ఖర్చు పెట్టి, 90 శాతం పనులు పూర్తయ్యాయని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సమయంలో అబద్ధాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సీతారామ ప్రాజెక్టు కు 500 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. గత 3 ఎన్నికల్లో తమ జిల్లా ప్రజలు బిఆర్ఎస్ ఇచ్చింది ఒకే సీటిచ్చి సరిపెట్టారని, రాబోయే రోజుల్లో అది సున్నా కావటం ఖాయమని ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ గెలిచిన ఒక్కసీటులోనూ తన ఫోటో పెట్టుకుని తన శిష్యుడు గెలిచాడన్నారు. ఖమ్మం పౌరుషమేంటో కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలని, తమ జిల్లా ప్రజలను ఎంత తక్కువ గోకితే అంత మంచిదని హరీష్ రావు‌ మీద సెటైర్ వేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10