తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లారు అక్కినేని నాగార్జున. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని.. తన కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు.
టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, నాగచైతన్య, సమంత వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొండ సురేఖపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. తమ రాజకీయాల కోసం సినీ తారలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానేయ్యాలంటూ సోషల్ మీడియా వేదికగా సీరియస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే నాంపల్లి కోర్టును ఆశ్రయించారు నాగార్జున.