పాము పేరు చెబితే సహజంగా అందరికీ భయం వేస్తుంది. విషపూరిత నాగుపాము అంటే ముచ్చెమటలు పడతాయి. కొందరికైతే వెన్నులో వణుకుపుట్టి జ్వరం కూడా వస్తుంది. ఒక్క పామును చూస్తేనే అలా అయిపోతే.. ఏకంగా 32 పాములు ఇంట్లో ప్రత్యక్షమైతే. గుంపులు గుంపులుగా ఇంట్లో తిరుగుతుంటే.. వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలోని ఓ ఇంట్లో కుప్పలు కుప్పలుగా పాము పిల్లలు ప్రత్యక్షమయ్యాయి. నెహ్రూ బస్తీలోని నివాసముండే ఎలక్ట్రిషీయన్ రాజు ఇంట్లోని గోడ రంధ్రంలో ఈ పాము పిల్లలు కనిపించాయి.
వాటిని చూసి భయంతో వణికిపోయిన రాజు కుటుంబసభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్ టీమ్‌కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ దత్తు టీం.. ఇల్లంతా జల్లెడ పట్టి ఒక పెద్ద నాగుపామును, 32 నాగుపాము పిల్లలను పట్టుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి నాగు పామును వాటి పిల్లలను చాకచక్యంగా డబ్బాలో బంధించారు. నాగు పాము పిల్లలు చిన్నవే అయినా.. డబ్బాలో బంధించిన తర్వాత కూడా పగడవిప్పి బుసలు కొడుతూ కనిపించాయి. వాటిని చూసిన స్థానికులు, రాజు కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.