AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిరాడంబరంగా గులాబీ పార్టీ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సాధ‌న ల‌క్ష్యంగా ఏర్పాటైన భారత రాష్ట్ర స‌మితి పార్టీ ఆవిర్భవించి 23 ఏళ్లు అవుతుంది. ప్రతిఏటా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం గులాబీ పార్టీకి ఆనవాయితీగా వస్తుంది. కానీ, వివిధ కారణాలతో మూడేళ్లుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్లీనరీని నిర్వహించలేకపోతుంది గులాబీ పార్టీ. ఈ సారి కూడా ప్లీనరీ నిర్వహణపై ఎన్నికల కోడ్ ప్రభావం పడింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా ప్లీనరీ నిర్వహణకు పార్టీ బ్రేక్ వేయాల్సి వచ్చింది. 2019లో కూడా పార్లమెంట్ ఎన్నికల కోడ్‌తో ప్లీనరీని నిర్వహించలేక పోయింది. ఆ తర్వాత కరోనా ప్రభావంతో వరుసగా రెండేళ్లు ప్లీనరీ నిర్వహించడం సాధ్యం కాలేదు. ప్రతి ఏటా ప్లీనరీ పేరుతో ప్రతినిధుల స‌భ‌, తర్వాత బ‌హిరంగ స‌భ‌ను నిర్వహించే ఆనవాయితీ ఉన్నా.. మూడేళ్లుగా వివిధ కార‌ణాల‌తో సాధ్యం కావ‌డం లేదు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న లక్ష్యంగా 23 ఏళ్ల క్రితం..జలదృశ్యం వేదికగా 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిని మొదలుపెట్టారు కేసీఆర్. అప్పటినుంచి గులాబీ పార్టీగా తెలంగాణ ప్రజల మధ్య నిరంతరం ఉండే విధంగా కేసీఆర్ కార్యాచరణ అమలు చేస్తూ వచ్చారు. దాదాపు 12 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఈ సమయంలో పార్టీ ఎన్నో ఎత్తు పల్లాలను చూడాల్సి వచ్చింది. అయినా రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ నినాదాన్ని అందుకోగా తప్పని పరిస్థితిని సృష్టించారు గులాబీబాస్.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10