రేవంత్ సర్కార్ నిర్వహిస్తున్న కులగణన సర్వేలో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఇటీవల బంజారాహిల్స్‌లోని కవిత ఇంటికి కులగణన అధికారులు వెళ్లారు. కవిత, ఆమె భర్త కుటుంబ వివరాలు ఇచ్చి సర్వేలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ నేతలు వైరల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనకు కవిత మద్దతు ఇచ్చారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ కూడా కవితను చూసి అనుసరించాలని సూచిస్తున్నారు. కులగణనలో కవిత పాల్గొన్న ఫొటోలను కాంగ్రెస్ నేతలు వైరల్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ శ్రేణులకు కూడా ఈ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత కులగణనకు సహకరించారని పోస్టులు పెడుతున్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత మొదటి నుండి పోరాటం చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. గతంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల కోసం పలు సమావేశాలు, సభలు, రౌండ్ టేబుల్ మీటింగ్స్‌ను కవిత ఏర్పాటు చేసిందని గుర్తు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు కుల గణన విషయంలో తమ వద్దకు ఎన్యూమరేటర్లకు కవిత అన్ని వివరాలు అందచేసిందని చెబుతున్నారు.