ఉప ఎన్నికలు ఖాయం
న్యాయపోరాటం చేస్తున్నామని స్పష్టీకరణ
రాజ్యాంగ నిపుణులతో జోరుగా చర్చలు
(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు ఖాయమని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్‌ఎస్ న్యాయపోరాటం చేస్తోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రాజ్యాంగ నిపుణులతో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపింది.
సుప్రీంకోర్టులో కేసు వేస్తాం..
త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారని, తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామని కేటీఆర్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పులతోపాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగాన్ని నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ తెలిపారు.
బీఆర్‌ఎస్ ముమ్మర యత్నాలు..
కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది. అటు రాజ్యాంగ నిపుణులతోనూ పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది. రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదులతో జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు రవిచంద్ర సహా పార్టీ నాయకులు పాల్గొన్నారు.