18ఏళ్లుగా న్యాయపోరాటం చేసి గెలిచా
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు చెంప చెల్లుమనేలా హైకోర్టు తీర్పు ఇచ్చిందని పిటిషనర్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. చెన్నమనేనిపై హైకోర్టు తీర్పు తరువాత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. చెన్నమానేని రమేశ్ న్యాయ స్థానాన్ని తప్పుదోవ పట్టించారని, 45సార్లు జర్మనీ పాస్‌పోర్ట్ మీద ప్రయాణం చేసినట్లు , జర్మనీలో ఓసీఏ కార్డును పొడిగించాలని దరఖాస్తు పెట్టుకున్న ఆధారాలను కోర్టుకు సమర్పించామని తెలిపారు. జర్మనీ పౌరసత్వం కలిగి చెన్నమనేని ఇండియాలో ఎమ్మెల్యే అయ్యాడని, చట్టాన్ని ఉల్లంఘించాడు కాబట్టే న్యాయస్థానంలో పోరాటం చేసి గెలిచానని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జర్మనీలో పెట్టుకున్న దరఖాస్తులు గతంలో ఇండియన్, ప్రస్తుతం జర్మనీ పౌరసత్వం కలిగినట్లు అతను దరఖాస్తు పెట్టుకున్నాడు. భారతదేశ ప్రభుత్వాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తప్పుడు పత్రాలు సమర్పించి ఎమ్మెల్యేగా గెలిచాడు. మరోవైపు న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించేలా వ్యవహరించాడు. చిన్నమనేని రమేశ్‌పైన పోరాటం చేస్తుంటే నాపైన ఆయన అనుచరులు కేసులు పెట్టి జైలు కు పంపాలని ప్రయత్నం చేశారని పిటిషనర్ పేర్కొన్నారు.
పోరాటం చేసి గెలిచా..
18ఏళ్ల పాటు న్యాయపోరాటం చేసి చెన్నమనేనిపై గెలిచానని ఆది శ్రీనివాస్ అన్నారు. ‘న్యాయస్థానాలపై నాకు నమ్మకం ఉండడం వల్లే ఓపిగ్గా పోరాటం చేశాను. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాను. వేములవాడ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుక పడడానికి ప్రధాన కారణం చెన్నామనేని రమేశ్. కేవలం ఎమ్మెల్యే అనే పదవిని కుటుంబం అడ్డుపెట్టుకుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు చెన్నమనేని రమేశ్‌కు చెంప చెల్లుమనేలా అనిపించింది. తనను భారతీయుడుగా గుర్తించాలని రమేశ్ వేసిన పిటీషన్‌ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇప్పటికైనా న్యాయం గెలిచిందని నేను భావిస్తున్నాను అని పిటిషనర్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.