హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పరిధిలోని జిల్లెలగూడలో అదృశ్యం అయిన 13 ఏళ్ల బాలుడు ఆచూకీ లభ్యమైంది. ట్యూషన్ అని చెప్పి వెళ్లిన 8 వ తరగతి చదువుతున్న మహీధర్ రెడ్డి తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు. ఆదివారం సాయంత్రం ట్యూషన్ వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు రెండు బృందాలుగా గాలింపు చేపట్టారు. అయితే తిరుపతిలో బాలుడిని పోలీసులు గుర్తించి సమాచారం అందించారు. బాలుడు తమ వద్ద ఉన్నట్లు కుటుంబ సభ్యులతోపాటు మీర్‌పేట్ పోలీసుకుల సమాచారం ఇచ్చారు.
బాలుడిని పోలీసులు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. కాగా, ట్యూషన్ అని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన బాలుడు.. ఓ వ్యక్తి బైక్‌పై వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డైంది. వాహనదారుడిని గుర్తించి పోలీసులు విచారించారు. లిఫ్ట్ అడిగితే బ్రాప్ చేశానని వాహనదారుడు చెప్పాడు. అయితే మీర్‌పేట్ బస్టాప్ లో దిగిన ఆ బాలుడు..నడుచుకుంటూ మలక్ పేట్ వెళ్లాడు.. అక్కడినుంచి రైల్వే స్టేషన్ వెళ్లి రైలు ఎక్కి తిరుపతి చేరుకున్నాడు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు గాలించారు. మంగళవారం ఉదయం తిరుపతిలో బాలుడిని భక్తులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. తిరుపతిలో స్కూల్ డ్రెస్ వేసుకొని తిరగడంతో అనుమానం వచ్చింది. వెంటనే బాలుడిని ప్రశ్నించగా.. హైదరాబాద్ నుంచి వచ్చినట్లు చెప్పాడు. అనంతరం ఆ బాలుడితో తండ్రి ఫోన్ నంబర్ తీసుకొని వివరాలు వెల్లడించారు. ఫోన్‌లో మాట్లాడిన తర్వాత పోలీసులకు ఆ బాలుడి తల్లిదండ్రులు సమాచారం ఇచ్చారు. అయితే ఇంటి నుంచి బయటకు వచ్చి తిరుపతి ఎందుకు వచ్చాడనే విషయం చెప్పలేదు.