– ఎస్టీల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు ఇచ్చేలా చొరవ చూపాలంటూ విన్నపాలు
– సానుకూలంగా స్పందించిన ద్రౌపది ముర్ము
– నిధుల కోసం కేంద్రానికి నివేదించాలంటూ సీతక్కకు ఆదేశాలు
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్ర మంత్రి సీతక్క, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గిరిజన, ఆదివాసి ప్రజల అభివృద్ధిపై రాష్ట్రపతి తో దాదాపు 15 నిమిషాల పాటు చర్చించారు. రాష్ట్రంలో ఎస్టీల పరిస్థితి, వారి సంక్షేమ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల వివరాలను రాష్ట్రపతికి వారు నివేదించారు. మరోవైపు తెలంగాణలోని ఎస్టీల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వచ్చేలా ప్రత్యేక చొరవ చూపాలని రాష్ట్రపతికి విన్నవించారు. గిరిజనుల గార్డియన్ గా వారి సంక్షేమానికి కేంద్రం నిధులు మంజూరు చేసేలా చూడాలని రాష్ట్రపతికి ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. వీరి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతి .. ఎస్టీల సంక్షేమం కోసం కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి? ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారు? ఇంకా ఎన్ని నిధులు కావాల్సి ఉంది? అన్న అంశాలపై ఎప్పటికప్పుడు ఎస్టీ ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహించి కేంద్రానికి నివేదిక అందజేయాలని మంత్రి సీతక్కను రాష్ట్రపతి ఆదేశించారు.