బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమల శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ములుగు గ్రామపంచాయతీని మున్సిపాలిటిగా మార్చే చట్టానికి ఆమోదం తెలపాలని రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. రెండు సంవత్సరాలుగా రాష్ట్రపతి కార్యాలయంలో ములుగు మున్సిపాలిటీ బిల్లు పెండింగ్ లో ఉందని, బిల్లును ఆమోదిస్తే ములుగు గ్రామపంచాయతీకి మున్సిపాలిటీ హోదా దక్కుతుందని రాష్ట్రపతికి మంత్రి సీతక్క వివరించారు. త్వరలో బిల్లు క్లియర్ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హైదరాబాద్ చేరుకున్నప్పటి నుంచి, ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యేంత వరకు రాష్ట్రపతి పర్యటన ఆద్యంతం మినీస్టర్ ఇన్ వెయిటింగ్ హోదాలో మంత్రి సీతక్క రాష్ట్రపతి వెంటే ఉన్నారు. అమె కావల్సిన అన్ని సౌకర్యాలను దగ్గరుండి మరీ చూసుకున్నారు మంత్రి సీతక్క.
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ కార్యక్రమన్ని రాష్ట్రపతి ప్రారంభించగా అదే వేదిక నుంచి మంత్రి సీతక్క ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలతో కళా మహోత్సవ కార్యక్రమం కొనసాగటం పట్ల సీతక్క హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆదివాసీ బిడ్డగా ఆదివాసీ గిరిజనుల నృత్యాలు తనను కట్టిపడేస్తాయని, నృత్యాలను తాను ఎంతగానో ఆస్వాదిస్థానాన్ని చెప్పారు. ఎవరు ఏ స్థాయికి ఎదిగినా తమ మూలాలను మరిచిపోవద్దని కోరారు. సంస్కృతి సాంప్రదాయాల వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. దేశంలో ఎన్నో కులాలు, ప్రాంతాలు, జాతులు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వమే భారత దేశానికి అసలైన బలమని తెలిపారు.
హైదరాబాద్ పర్యటన ముగించుకొని ఢిల్లీ బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ పల్లె సంస్కృతి ఉట్టిపడే పెయింటింగ్ ను రాష్ట్రపతికి మంత్రి సీతక్క బహుకరించారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సహచర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్ తో కలిసి మంత్రి సీతక్క వీడ్కోలు పలికారు.