మిషన్ భగీరథ ఏర్పాటు తర్వాతే రాష్ట్రంలో ప్రజలు నీళ్లు తాగగలుగుతున్నారని, అంతకుముందు నీళ్లు తాగలేదన్నట్లుగా ఎమ్మెల్సీ తక్కెనపల్లి రవీందర్రావు మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఇంతకు మీరు ఏ నీళ్లు తాగి పెరిగారని చురకలేశారు. తాగు నీటి నల్లా కనెక్షన్లకు సంబంధించి మండలిలో ఎమ్మెల్సీలు టి.జీవన్‌రెడ్డి, తక్కెనపల్లి రవీందర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానమిచ్చారు. గ్రామీణ మంచినీటి సరఫరా వ్యవస్థ ఎప్పటి నుంచో వుందన్నారు. రాష్ట్రంలో కొత్త నల్లా కనెక్షన్ల కోసం పెండింగ్ లో ఎలాంటి దరఖాస్తులు లేవని మంత్రి సీతక్క వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో..
2021 వరకు 53 లక్షల 98 వేల ఇళ్లకు 100 శాతం తాగునీరు అందుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జూన్, జూలై లో గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటి సర్వే చేసి నల్లా కనెక్షన్ల డిమాండ్ ను గుర్తించామని తెలిపారు. సర్వేలో 4 లక్షల 49 వేల ఇళ్లకు తాగునీరు నల్లా కనెక్షన్లు లేవనీ గుర్తించడం జరిగిందన్నారు. 3 లక్షల 21 వేల ఇళ్లకు ప్రభుత్వం నల్లా కనెక్షన్ల ఏర్పాటు పూర్తి చేసిందని తెలిపారు. ఇంకా లక్షా 28 వేల ఇళ్లకు తాగునీరు నల్లా కనెక్షన్లు అందించాల్సిన అవసరముందని తెలిపారు.
12,791బోర్లను, 7,227సింగిల్ ఫేస్ మోటార్లను, 5,946పీడబ్ల్యూఎస్ స్కీమ్ ల మరమ్మతులు జరిపించామని తెలిపారు. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకంతో గొప్పగా నీళ్లు అందించిందని చెప్పుకున్నప్పటికీ ఇంకా అనేక లక్షల ఇళ్లకు మంచినీటి సరఫరా జరగలేదన్నారు. అందుకే మా ప్రభుత్వం ఉట్నూరు పరిధిలో రూ.60కోట్లు, గజ్వేల్, భువనగిరి కోసం రూ.210కోట్లు, సిద్దిపేటకు కూడా రూ.3కోట్లు మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వం మెయింటనెన్స్ రూ.469కోట్లు పెండింగ్ లో పెట్టిందని చురకలేశారు. రక్షిత మంచినీటి సరఫరా పథకం నీటినే ప్రజలు వినియోగించేలా చూస్తామన్నారు.