బీఆర్‌ఎస్ నాయకులు ఆటో కార్మికులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని, వారిది కపట ప్రేమ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. నిధుల కొరత కారణంగా ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదని.. త్వరలోనే వారిని ఆదుకొని అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు.
మెట్రో వస్తే ఇతర వాటిపై ప్రభావం పడిందని, మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తే, ఆటో సర్వీసులకు ప్రభావం పడుతుందని చెప్పడం సరికాదన్నారు. బస్సులు ప్రజల ఇంటి దగ్గరికి వెళ్ళకుండా, బస్సు స్టాండ్ నుంచి వెళ్ళడం మాత్రమే జరుగుతోందని, ప్రజలు ఇంటి నుంచి బస్సు స్టాండ్ వరకు వెళ్ళేందుకు ఆటో సేవలను ఉపయోగించుకుంటున్నారని వివరణ ఇచ్చారు.
ఆర్థిక సంక్షోభం కారణంగానే..
ఆటో కార్మికులకు 12 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామన్న హామీ ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం కారణంగా ఇవ్వలేకపోయామని మంత్రి చెప్పారు. త్వరలో ఆ హామీ నెరవేరుస్తామని తెలిపారు. ఆటో కార్మికులు వేసుకునే డ్రెస్ లు వేసుకోవడం, బేడీలు వేసుకొని వేషాలు వేయడం అదొక రాజకీయ డ్రామా అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజకీయాలకు సంబంధించి నిరసనలు చేయడం అవసరం లేదని, నిజంగా చిత్తశుద్ధితో ఉంటే.. ఎప్పుడైనా రవాణా శాఖ మంత్రికి ఆటో కార్మికుల సమస్యలపై రిప్రజెంటేషన్ చేశారా అని నిలదీశారు.