AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అసెంబ్లీలో ‘భూ భారతి’ – బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి

– సామాన్యుల భూహక్కుల పరిరక్షణే ధ్యేయం
– దొరల గడీల్లో రూపొందించిన ‘ధరణి’ ఇక బంగాళాఖాతంలోకే..
– ఆర్‌ఓఆర్‌ చట్టాన్ని ప్రక్షాళన చేశామని మంత్రి వెల్లడి

తెలంగాణలో సామాన్యుల భూహక్కుల పరిరక్షణే ధ్యేయంగా 2024 ఆర్వోఆర్‌ –భూభారతి చట్టాన్ని రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. బుధవారం శాసనసభలో మంత్రి భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటువంటి అద్భుతచట్టాన్ని ప్రవేశపెట్టే అవకాశం తనకు లభించడం మరచిపోలేని విషయమని అన్నారు. 1971లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్వోఆర్‌ చట్టం 49 ఏళ్లపాటు ఉపయోగపడిందని, ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏడేళ్ల పాటు కూడా ప్రజోపయోగంగా ఉపయుక్తమయ్యిందని తెలిపారు. తర్వాత అర్ధరాత్రి నాలుగు గోడల నడుమ రూపొందిన ధరణి చట్టం వలన సమస్యలు పరిష్కారం కాకపోగా లక్షలాది సమస్యలను తెచ్చిపెట్టిందని చెప్పారు. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిందన్నట్లు ధరణి పోర్టల్‌తో లెక్కలేనన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం తెలంగాణ భూభారతి 2024 బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ.. నాలుగు గోడల మధ్యన కూర్చొని ధరణి పోర్టల్‌ తెచ్చారని.. వేల పుస్తకాలు చదివిన మేధావి తెచ్చిన 2020 ఆర్వోఆర్‌ చట్టంతో లక్షల సమస్యలు వచ్చాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు తయారుచేసిన ధరణి, ఆర్‌వోఆర్‌ చట్టాన్ని ప్రక్షాళన చేశామని మంత్రి తెలిపారు.

హరీశ్‌రావు సూచనలు సైతం..
హరీశ్‌రావు తమకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సూచనలను కూడా బిల్లులో పొందుపరచామన్నారు. దొరల గడిల్లో కూర్చుని తయారుచేసిన 2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. ముసాయిదా బిల్లును వెబ్‌సైట్‌లో పెట్టి 40 రోజులు అభిప్రాయాలు సేకరించామన్నారు. 33 జిల్లాల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకొని కొత్త భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని చెప్పారు. కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన దరావత్‌ రవి అనే బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ తన వద్దకు వచ్చారని.. ఆ గ్రామంలో సర్వే నంబర్‌ 149 నుంచి 160 లో ఉన్న భూమి ధరణి వచ్చాక అటవీ భూమిగా మార్చారని చెప్పారన్నారు. వారి స్థానిక ప్రజాప్రతినిదులకే ధరణి న్యాయం చేయలేదన్నారు. అలాంటి వారికి న్యాయం చేసేలా కొత్త చట్టం తీసుకువచ్చామని చెప్పారు. 18లక్షల ఎకరాలు పార్ట్‌ బిలో ఉందన్నారు. గతంలో ఆ భూమికి పాస్‌ బుక్కులు ఉంటే ఎందుకు పార్ట్‌ బి లో చేర్చారని ప్రశ్నించారు. కొత్త చట్టం ద్వారా పార్ట్‌ బి లోని భూముల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

కంట భూములు సైతం..
అబాది, గ్రామ కంట భూములకు పరిష్కారాలు ఈ కొత్త చట్టంలో ఉన్నాయన్నారు. పొజిషన్‌కు, పాసుబుక్కులో ఉన్న భూ విస్తీర్ణ వ్యత్యాసాలను సరిచేసే అవకాశం ఉందన్నారు. మ్యుటేషన్‌ పై అభ్యంతరాలు ఉంటే ఆర్డీవో ఆధ్వర్యంలో అప్పీల్‌ అథారిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వారసత్వ ఆస్తుల అభ్యంతరాలపై అప్పిల్‌ అథారిటీకి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. క్రాస్‌ చెక్‌ చేసి మ్యూటేషన్‌ చేసే అధికారం ఆర్డీవోకి కొత్త చట్టంలో కల్పిస్తుందన్నారు. సభ్యుల నుంచి మంచి సూచనలు వస్తే ఈ బిల్లులో చేర్చడానికి తమకు ఎలాంటి బేషజాలు లేవని స్పష్టం చేశారు. ఎమ్మార్వో రిజిస్ట్రేషన్‌ చేస్తారన్నారు. ఆర్డిఓ, కలెక్టర్‌ అప్పీల్‌ అథారిటీగా ఉంటారన్నారు. ఆ తర్వాత అప్పీల్‌ చేసుకోవడానికి ఒక ట్రిబ్యునల్‌ కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 2020 కి ముందు 9,24,000 సాధబైనామ దరఖాస్తులు చేసుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు.

సమయం ఇవ్వండి : హరీష్‌ రావు
ఇప్పుడే బిల్లు ప్రవేశపెట్టి ఇప్పుడే చర్చ అంటే ఎలా అని ప్రశ్నించారు. బీఏసీ మినిట్స్‌ రాలేదని.. ఏ బిల్లు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని.. బిల్లు తమ చేతికి ఇంకా అందలేదన్నారు. బిల్లు తమ చేతికి రాకుండా బిల్లును చదవకుండా చర్చలో ఎలా పాల్గొంటామని ప్రశ్నిస్తూ.. బిల్లుపై చర్చకు సమయం ఇవ్వాలన్నారు. రెండు రోజుల ముందే బిల్లు ప్రతులను సభ్యులకు ఇవ్వాలని.. లేదంటే అభ్యంతరం తెలిపే హక్కు సభ్యులకు ఉంటుందన్నారు. ‘‘కనీసం ఒక్కరోజు ముందు కూడా బిల్లు పత్రాలు మాకు ఇవ్వలేదు, మా ఇష్టం ఉన్నట్లు చేస్తామంటే మేం సభ నుంచి వెళ్లిపోతాం’’ అని హరీష్‌ రావు తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10