మెట్రో ప్రయాణీకులకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ షాక్ ఇచ్చింది. మెట్రో కార్డుపై 10 శాతం రాయితీని ఎత్తివేసిన అధికారులు.. రూ. 59 హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేశారు. ఈ నిర్ణయంతో ఎండలకు కూల్ జర్నీ చేద్దామనుకున్న ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలినట్టైంది. సాధారణ రోజుల్లో ఉండే మెట్రో కార్డు కొంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు.. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఇచ్చే 10 శాతం రాయితీని సైతం ఎత్తివేసింది. ఎండల తీవ్రతతో మెట్రో రైలుకు డిమాండ్ పెరగడంతో రాయితీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
మెట్రో రైల్ అధికారుల నిర్ణయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాయితీలను పునరుద్ధరించాలని కోరుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు ప్రజలకు ప్రధాన రవాణా సాధనంగా మారింది. ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా తక్కువ సమయంలో తమ గమ్యస్థానాలకు ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు చేరుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో, సెలవు రోజుల్లో మెట్రోలో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతుండటంతో ప్రజలు మెట్రో బాటపట్టడగా.. ఈ క్రమంలోనే రూ. 59 హాలిడే కార్డును రద్దు చేశారు.