తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9న మొదలవనున్నాయి. ఈ మేరకు సమావేశాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జారీ చేశారు. డిసెంబర్ 9న ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. అయితే, సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్న విషయంలో స్పష్టత లేదు. బీఏసీ సమావేశంలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. శాసనసభతో పాటు మండలి సైతం ప్రతి రోజూ ఉదయం 10.30 గంటలకు సమావేశం జరుగనున్నది.
ప్రభుత్వం పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చకు సిద్ధమవుతున్నది. మరో వైపు బీఆర్ఎస్ సహా ఇతర ప్రతిపక్షాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, పథకాల అమలుపై నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీలో కొత్త ఆర్ఓఆర్ చట్టం, కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్, పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లతో పాటు కొత్త చట్టాలపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉండగా.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు, రైతు భరోసా, పింఛన్ల పెంపు, రుణమాఫీ తదితర అంశాలపై రేవంత్ సర్కారును నిలదీసేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తున్నది.