తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై చర్చించి ఆమోదం తెలిపింది. అనంతరం వాయిదా పడిన అసెంబ్లీ తిరిగి రేపు ప్రారంభం కానుంది. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక అంశాలను సభ ముందు పెట్టనుంది.
స్కిల్ యూనివర్సిటీ, రైతుభరోసా, హైడ్రాపై రసవత్తరంగా చర్చ జరగనుంది. అటు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం. మొట్టమొదటి సారిగా ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ సభలో అడుగు పెడితే ఈ శీతాకాల సమావేశాలు మరింత హాట్ హాట్ గా సాగే అవకాశాలు ఉన్నాయి.
ఈ నెల 16వ తేదీన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ సభకు వస్తారా? రారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ప్రభుత్వం ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. ఇప్పటికే కొత్త ఆర్వోఆర్ చట్టానికి సంబంధించిన ముసాయిదాను రెడీ చేసిన నేపథ్యంలో సభ ముందు పెట్టబోతోంది. సభలో చర్చ అనంతరం ఆమోదించబోతోంది. కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని ప్రభుత్వం తీసుకురాబోతోంది. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లులు కూడా సభ ముందుకు రానున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త గ్రామాల విలీనానికి సంబంధి సభ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
రైతుభరోసాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు. సంక్రాంతి తర్వాత రైతులకు రైతుభరోసా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయబోతోంది. గత ప్రభుత్వంలో రైతుభరోసాను అమలు చేసినట్లు.. ప్రతి రైతుకు అందజేస్తారా? శ్లాబ్ ఏమైనా నిర్ణయిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. శ్లాబ్ గా నిర్ణయిస్తే.. ఎన్ని ఎకరాల వరకు రైతుభరోసాను అమలు చేస్తారన్న తెలియాల్సి ఉంది. దీనిపై అత్యంత కీలక ప్రకటన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.
అటు మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరవుతారా? లేదా? అన్నది అత్యంత హాట్ టాపిక్ గా మారిన అంశం. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఒకే ఒకసారి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసి వెళ్లారు. ఆ తర్వాత ఏ సీజన్ లోనూ సభకు హాజరు కాలేదు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులంతా కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో కేసీఆర్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ సభకు హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.