హైదరాబాద్‌లోని దోమల్ గూడ భారీ దోపిడీ జరిగింది. అరవింద్ కాలనీలో శుక్రవారం తెల్లవారుజాము బంగారం వ్యాపారి ఇంట్లోకి చొరబడిన 10 మంది దుండగులు.. కత్తులు, తుపాకులతో బెదిరించి చోరికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులను కత్తులో బెదిరించి లాకర్లలోని 2.5 కిలోల బంగారం, మూడు ముబైల్స్ , ఐట్యాబ్ చోరీ చేశారు. వెళ్లేప్పుడు సీసీ కెమెరాల డీవీఆర్‌ను ఎత్తుకెళ్లారు. దుండగుల దాడిలో వ్యాపారి రంజిత్ కు గాయాలయ్యాయి. పశ్చిమ బెంగాల్ కు చెందిన రంజిత్ కుటుంబం.. తమ ఇంటికి కిందనే బంగారం వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
క్లూస్ టీమ్‌తో ఆధారాల సేకరణ..
ఇప్పటికే క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. బాధిత కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరించి దుండగుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. బాధితుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటివి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాధితుడు ఇంట్లోకి దుండగులు చొరబడటంతో తెలిసినవారే ఈ తరహా ప్లాన్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
బెంగాల్‌కి చెందిన ఇంద్రజిత్, రంజిత్ ఇద్దరు అన్నదమ్ములు.. కుటుంబ సభ్యులతో కలిసి పదేళ్ల క్రితమే నగరానికి వచ్చి బంగారం వ్యాపారం పెట్టుకున్నారు. ‘ఎమ్మెస్ గోల్డ్ వర్క్ షాప్’ పేరుతో గ్రౌండ్ ఫ్లోర్ లో కొంతమంది పనివాళ్లతో ఆర్డర్లపై బంగారం ఆభరణాలు తయారు చేయించి.. జ్యూయలరీ షాప్‌లకు పంపిస్తుంటారు. మాస్కులు ధరించిన కొంతమంది దుండగులు.. తెల్లవారుజామున 3: 30 గంటల సమయంలో ఇంద్రజిత్ ఇంట్లో చోరీకి దిగారు. అక్కడ అంతగా సొత్తు కనిపించకపోవడంతో అతన్ని తీసుకుని పక్క ప్లాట్‌లో ఉన్న రంజిత్ వద్దకు తీసుకుని వచ్చారు. తలుపు కొట్టడంతో వాళ్లు కిటికీలోంచి బయటకు చూశారు.
చంపేస్తామని బెదిరించడంతో..
డోర్ తీయకుంటే మీ తమ్ముడిని చంపేస్తామని బెదిరించడంతో.. అతను తలుపు తీసి బెడ్ రూమ్‌లోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు. దీంతో దుండగలు తలుపులు బద్దలు కొట్టి రంజిత్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో అతని చేతికి గాయమైంది. ఆయన సతీమణి దగ్గరకు వెళ్లి బంగారం ఇవ్వు.. లేదంటే చంపేస్తామని బెదిరించి బీరువా ఓపెన్ చేసి, 2.5 కిలోల బంగారం, మూడు ముబైల్స్ , ఐట్యాబ్ చోరీ చేశారు. శుక్రవారం ఉదయం దోమలుగూడా పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో .. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. క్లూస్ టీమ్ వేలు ముద్రలను సేకరించి చుట్టు ప్రక్కల ప్రాంతంలో సీసీ పుటేజ్ లను పరిశీలిస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు..