తెలంగాణలో మరోసారి భారీ స్థాయిలో సివిల్ సర్వీసెస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. బుధవారం కేంద్రం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ట్రాన్ ఫర్స్ ఉండనున్నాయి.
తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ అధికారులను వెంటనే సొంత రాష్ట్రంలో చేరాలని కేంద్రం 11 మంది సివిల్ సర్వీసెస్ అధికారుల్ని ఆదేశించింది. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య అధికారుల మార్పిడి జరగనుంది.
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తెలంగాణ, ఏపీ మధ్య క్యాడర్ కేటాయింపులపై పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కోర్టును సైతం ఆశ్రయించారు. అయినా ఆయా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఫలితం దక్కలేదు.
అధికారులు తమ అభ్యంతరాలను పక్కన పెట్టి తక్షణం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణ నుంచి ఐదుగురు ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌లు, అలాగే ఏపీ నుంచి ఐదుగురు ఐఏఎస్‌లు రిలీవ్ కానున్నారు.
మాజీ డీజీపీ అంజనీకుమార్ ఏపీకే…
తెలంగాణలోనే పని చేస్తున్న సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ అంజనీకుమార్ సహా అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతిలను రిలీవ్ చేస్తూ కేంద్రం నిర్ణయించింది. వీరిని ఏపీ ప్రభుత్వంలో చేరాలని ఆదేశాలిచ్చింది. 2019 ఎన్నికల సమయంలో అభిషేక్ మహంతి కడప జిల్లా ఎస్పీగా పని చేసి తెలంగాణకు బదిలీ అయ్యారు.
ఇక ఐఏఎస్ ఆఫీసర్స్ లో రోనాల్డ్ రాస్ , ప్రశాంతి, వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణి ప్రసాద్ లతో కూడిన ఐదుగురు ఐఏఎస్‌లను ఏపీ క్యాడర్ కు వెళ్లాలని కేంద్రం తేల్చిచెప్పింది.
ఏపీ నుంచి తెలంగాణకు ఐదుగురు ఐఏఎస్‌లు
ఏపీ నుంచి ఐదుగురు ఐఏఎస్లను కేంద్రం రిలీవ్ చేసింది. వారిలో ఎస్ఎస్ రావత్, అనంత్ రామ్, సృజన, శివశంకర్, హరికిరణ్ ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ నెల 16లోగా వీరంతా తెలంగాణ ప్రభుత్వంలో రిపోర్ట్ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో త్వరలోనే మరోసారి భారీ స్థాయిలో బదిలీలు ఉండనున్నట్లు సమాచారం.