AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 40మంది మావోలు హతం..

దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌‌   అడవుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బస్తర్ రేంజ్‌లోని నారాయణ్‌పుర్‌- దంతెవాడ సరిహద్దు అటవీ ప్రాంతంలో శుక్రవారం తుపాకుల మోత కలకలం రేపింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 40 మంది మావోలు మృతిచెందినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వెల్లడించారు.

చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం అబూజ్‌మడ్‌‌లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇవాళ మధ్యాహ్న సమయంలో భద్రతా దళాలు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఒకరిపై ఒకరు తూటాల వర్షం కురిపించుకుంటూ ఇరువర్గాలు భీకరంగా పోరాడుతున్నాయి.

ఎదురు కాల్పుల్లో 40మంది మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను ఘటనా స్థలంలో గుర్తించినట్లు భద్రతా దళాలు తెలిపాయి. అలాగే మృతుల నుంచి భారీఎత్తున ఆటోమేటెడ్ ఆయుధాలు, ఏకే 47 సహా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. బస్తర్‌ ప్రాంతంలో ఈ ఏడాది 170మందికి పైగా మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

అలాగే సెప్టెంబర్ 03వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో భారీ ఎన్‌కౌంటర్‌లో జరిగింది. బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో మావోలు ఉన్నారని అందిన సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు.. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో 9మంది మావోలు మృతిచెందారని అధికార వర్గాలు తెలిపాయి. ఘటన స్థలంలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 303 సెల్ఫ్ లోడింగ్ రైపిల్స్‌తోపాటు 12 తుపాకులు దొరికినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10