AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉత్కంఠ మ్యాచ్‌లో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!

ఐపీఎల్‌ 2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కీలక మ్యాచ్‌లో విజయం సాధించింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తేడాతో గెలుపొందింది. దీంతో ఈ సీజన్‌లో ఆడిన 10 మ్యాచుల్లో 6 విజాయన్ని నమోదు చేసి.. ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. ఈ మ్యాచ్‌ ఓటమితో ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలు సన్నగిల్లాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్.. 144/7 పరుగులకే పరిమితమైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు లక్నో సైతం తీవ్రంగా శ్రమించింది. చివరకు మరో 4 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది.

145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డెబ్యూ ప్లేయర్‌ అర్షిన్ కులకర్ణి గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. ఈ దశలో కేఎల్‌ రాహుల్‌ (22 బంతుల్లో 28 రన్స్‌), మార్కస్‌ స్టోయినిస్‌ (45 బంతుల్లో 62 రన్స్‌) ఆదుకున్నారు. అయితే దీపక్‌ హుడా (18 బంతుల్లో 18), నికోలస్‌ పూరన్‌ (14 బంతుల్లో 14 రన్స్‌), అష్టన్ టర్నర్‌ (9 బంతుల్లో 5 రన్స్‌) వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. దీంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. కానీ చివర్లో పూరన్‌ రెండు షాట్లు కొట్టి జట్టును గెలిపించాడు. ముంబై బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా 2, మహమ్మద్‌ నబీ 1, జస్‌ప్రీత్‌ బుమ్రా 1, గెరాల్డ్‌ కొయెట్జీ 1 వికెట్‌ తీశారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 144/7 పరుగులకే పరిమితమైంది. లక్నో బౌలర్ల ధాటికి ముంబై బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఆ జట్టుకు పరుగులు రావడం కష్టంగా మారింది. బర్త్‌డే బాయ్‌ రోహిత్ శర్మ 4 రన్స్‌ చేసి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ (10), తిలక్‌ వర్మ (7), హార్దిక్‌ పాండ్యా (0) ఔట్‌ కావడంతో ముంబై ఇండియన్స్‌ 27/4తో నిలిచి కష్టాల్లో పడింది.

ఈ దశలో ఇషాన్‌ కిషన్‌ (32)తో పాటు నేహాల్‌ వధేరా (46), టిమ్ డేవిడ్‌ (35)లు ఆదుకున్నారు. దీంతో ముంబై ఇండియన్స్‌ జట్టు స్కోరును 144 పరుగులకు చేర్చింది. లక్నో బౌలర్లలో మోసీన్‌ ఖాన్‌ 2, మార్కస్‌ స్టోయినిస్‌ 1, నవీన్‌ ఉల్‌ హక్‌ 1, మయాంక్ యాదవ్‌ 1, రవి బిష్ణోయ్‌ 1 వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌ ఫలితంతో ఆడిన 10 మ్యాచుల్లో ఆరింట్లో గెలిచిన లక్నో.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. పదింట్లో ఏడు మ్యాచ్‌లు ఓడిన ముంబై 9వ ప్లేసుకు పరిమితమైంది. ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10