తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. చలికాలంలో కూడా కురుస్తున్న వర్షాలు తెలంగాణ వాసులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. గత గజా వణకాల్సిన చలిలో కూడా వర్షాలు కురవడం, చలిగాలులు వీస్తూ ఉండడంతో భిన్న వాతావరణ పరిస్థితి నెలకొంది. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాల దెబ్బ తెలంగాణ రాష్ట్రం పైన బాగానే పడుతుంది.
తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటలలో తీవ్ర అల్పపీడనంగా బలపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు.
మరో అల్పపీడనం త్వరలో ఇవి మాత్రమే కాదు ఈనెల 14 లేదా 15 తేదీలలో అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది 16, 17 తేదీల నాటికి ఏపీ, తమిళనాడు వైపు పయనిస్తుందని దీని ప్రభావంతో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఇక ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నేడు యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యపేట జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.