మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. నేడు నిర్వహించిన ఎన్నికల ప్రచారంతో సిద్దిపేట దద్దరిల్లింది. ఎన్సాన్ పల్లి మండలానికి వచ్చిన రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ, నీలం మధుకు సిద్దిపేట ఇన్చార్జి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ స్వాగతం పలికారు. ఎన్సాన్ పల్లి అంబేద్కర్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమంలో తాడూరి శ్రీనివాస్, గూడూరు శ్రీనివాస్ గౌడ్, గాడి పెళ్లి శ్రీనివాస్, గంప మహేందర్, బొమ్మల యాదగిరి, మార్గ సతీష్, బిక్షపతి, సూర్య వర్మ, అంజన్న, సత్తన్న, లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రజా సేవ చేసేందుకు ప్రజల ముందుకు వచ్చిన పేదింటి బిడ్డ నీలం మధును ఆశీర్వదించి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మన కుటుంబంలో ఎవరిదైనా పెళ్లి జరిగితే వెనుక, ముందు ఎలాగైతే ఆలోచన చేస్తామో? రాజకీయాలలో సైతం అభ్యర్థి వ్యక్తిత్వం, మనిషి ఎలాంటి వ్యక్తో చూడాలని సూచించారు.
బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి ఇక్కడికి వచ్చారా? వారిద్దరూ కూడా కోట్లకు పడగలెత్తిన వారేనని విమర్శించారు. వారిని ఎప్పుడైనా కలిశారా? కనీసం చూశారా? అని ప్రశ్నించారు. ఫోటోలు, ఫ్లెక్సీలలో వారి ముఖాలను చూడండని పేర్కొన్నారు. సిద్దిపేటలో పేరున్న మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి ఇప్పుడైనా పోయారా? అని ప్రజలను అడిగారు. బీఆర్ఎస్, బీజేపీ వాళ్లు పెద్దవాళ్లకు పని చేస్తారు తప్ప పేదోళ్లను పట్టించుకోరని దుయ్యబట్టారు. బీజేపీతో, బీఆర్ఎస్ కుమ్మక్క అయిందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే ఎంపీలను అమ్ముకుంటారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఆరు నెలలైనా కానీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అందరి బతుకులు బాగుపడతాయన్నారు. వడ్డెర సంఘానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మాయ మాటలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని కొండా సురేఖ సూచించారు.
ప్రజా సేవ చేసేందుకు వచ్చా: నీలం మధు
గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి పార్లమెంట్‌కు అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రతి ఒక్కరి కష్టసుఖాలు తెలుసునని ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. ప్రజా సేవ చేసేందుకు ముందుకు వస్తున్నానని, తనను ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపించాలని ఈ సందర్భంగా నీలం మధు ప్రజలను విజ్ఞప్తి చేశారు.