యావత్ దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్న వేళ.. 1991లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అప్పటి ప్రధాని పీవీ నర్సింహరావు, తన క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ను తీసుకున్నారు. విపక్షాల నుంచి, కాంగ్రెస్ పార్టీలోని నేతల నుంచి విమర్శలు వచ్చినా ఆర్థిక సంస్కరణలను విజయవంతంగా అమలు చేశారు. సరళీకృత ఆర్థిక విధానాల అమలుతో దేశ రూపురేఖలే మారిపోయాయి. ఆర్థిక సంస్కరణల అమలుతో 1996 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 1996-98 మధ్య యునైటెడ్ ఫ్రంట్, 1998-2004 మధ్య బీజేపీ నేత వాజపేయి సారధ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కొనసాగింది.
తిరిగి 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సోనియాగాంధీ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకున్నది. మిత్రపక్షాల మద్దతుతో ఏర్పాటైన యూపీఏ కూటమి తొలి విడుత ప్రభుత్వానికి మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఐదేండ్లు పదవీ కాలం పూర్తి చేసుకున్న తర్వాత రెండోసారి ప్రధానిగా నియమితులైన కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్. 2009లో యూపీఏ కూటమి మరింత మెజారిటీ సాధించింది. దీంతో రెండోసారి ప్రధానిగా మన్మోహన్ సింగ్ 2009లో పదవీ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి 2014 వరకూ ప్రధానిగా పదేండ్ల పాటు కొనసాగారు.
యూపీఏ ప్రభుత్వ సారధిగా మన్మోహన్ సింగ్ హయాంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, పౌరులందరికీ గుర్తింపు కార్డు ఆధార్ జారీ చేసేందుకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ, జాతీయ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం చేశారు. యూపీఏ ప్రభుత్వానికి బయటి నుంచి లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించినా 2008లో అమెరికాతో చారిత్రక పౌర అణు ఒప్పందం కుదుర్చుకున్నారు. 1991లో దేశ ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 2019 వరకూ అసోం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019 నుంచి 2024 వరకూ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.