AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజకీయ కుట్రలో భాగంగానే నన్ను జైల్లో పెట్టారు- పట్నం నరేందర్ రెడ్డి

కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

గత నెలలో, ప్రజాభిప్రాయసేకరణ కోసం లగచర్ల గ్రామానికి వెళ్లిన జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై రైతులు తిరగబడడం తెలిసిందే. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పోలీసులు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు పలువురు రైతులను కూడా అరెస్ట్ చేశారు. వీరికి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నాంపల్లి స్పెషల్ కోర్టు పట్నం నరేందర్ రెడ్డితో పాటు రైతులకు బెయిల్ మంజూరు చేయడంతో, నేడు విడుదలయ్యారు.

‘నాకు కేసుతో సంబంధము లేదు. రాజకీయంగా అణగదొక్కాలని కేసు పెట్టారు. బలవంతంగా నన్ను అదుపులోకి తీసుకున్నారు. హెల్త్ చెకప్ సమయంలోనే నాతో పోలీసులు అన్ని సంతకాలు తీసుకున్నారు. నాకు బెయిల్ రాగానే కేటీఆర్ పై కేసు పెట్టారు. కొడంగల్ లో ఏ గ్రామానికైనా రా.. గ్రామ సభ ఏర్పాటు చేసుకుందాం. పథకాల అమలుపై చర్చిద్దాం. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కుట్రతో అధికారులపై దాడి చేయించారు. కేసు నుంచి కాంగ్రెస్ నేతలను ఎందుకు తప్పించారో రేవంత్ చెప్పాలి. కుట్ర మేము చేయలేదు. రేవంత్ అన్న తిరుపతి రెడ్డి చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించాలి’ అని పట్నం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ ను డిమాండ్ చేశారు.

”తప్పుడు కేసులు పెట్టి అమాయక రైతులను, నన్ను జైల్లో పెట్టారు. ఆరు గ్యారెంటీలను ఎగరగొట్టాలనే ఉద్దేశ్యంతో, ఒక రాజకీయ కుట్రలో భాగంగానే నాపైన, రైతులపైన ముఖ్యమంత్రి రేవంత్ కేసులు పెట్టారు. అక్రమంగా జైలుకి పంపారు. న్యాయస్థానంలో ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. ఎన్ని తప్పుడు కేసులు పెట్టిన భయపడేది లేదు. రైతుల కోసం, ప్రజల కోసం ఎన్ని సార్లైనా జైలుకి వెళ్లేందుకు సిద్ధమే. అధికారులపై దాడి కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ఘటన జరిగిన సమయంలో నేను హైదరాబాద్ లో ఉన్నా.

ఆ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేకున్నా నన్ను ఇరికించారు. కొడంగల్ లో నన్ను రాజకీయంగా అణగదొక్కాలని తప్పుడు కేసులో నన్ను ఇరికించారు. పై నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయని చెప్పి పోలీసులు బలవంతంగా నన్ను తీసుకెళ్లారు. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు, మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా? ఎఫ్ఐఆర్ ఉందా? అని పోలీసులను అడిగా. పై నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. నన్ను కొడంగల్ ఆసుపత్రికి తీసుకెళ్లి నాకు హెల్త్ చెకప్ చేశారు. ఆ సమయంలోనే అన్ని పేపర్ల మీద నాతో సంతకాలు పెట్టించుకున్నారు. నాకు చదవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. నేరుగా జడ్జి ముందు ప్రవేశపెట్టారు” అని పట్నం నరేందర్ రెడ్డి చెప్పారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10