సీట్ల సర్దుబాటు జరిగింది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలోనే.. అంతర్గతంగా ఇంకేదో జరిగిపోతోంది.. ఈ క్రమంలోనే పొత్తు.. ఉందా లేదా..? ఉంటే ఇలా జరుగుతుందేంటి..? ఎన్నికల వేళ ఈ గొడవలేంటి..? ఇలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ క్యాడర్‌లో ఇప్పుడు సరికొత్త సందేహాలు వెంటాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ఏపీ కూటమిలో కుంపట్లు మొదలవ్వడం రాజకీయాల్లో సంచలనంగా మారింది.. కూటమిలో విబేధాలు తారాస్థాయికి చేరాయి.. అనడానికి కూటమి మేనిఫెస్టో విడుదల వేదికగా మారింది. పైకి ఇంతలా కనిపిస్తే.. లోలోపల ఇంకెంత ఉందోనంటూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..
ఎన్డీఏ కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ మేనిఫెస్టోను మంగళవారం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ విడుదల చేశారు.. అయితే.. వేదికపై బీజేపీకి చెందిన సిద్ధార్థ్ నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. అంతా బాగుందనుకున్న సమయంలోనే.. కూటమి మేనిఫెస్టో విడుదల కొంచెం ఆలస్యం అయింది.. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, సిద్ధార్థ్ నాథ్ సింగ్ వేదికపై నుంచి మేనిఫెస్టో కాపీలను విడుదల చేశారు. ఈ క్రమంలోనే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేతుల్లో కూటమి మేనిఫెస్టోను పట్టుకుని.. మీడియాకు చూపించారు.. అయితే.. అక్కడ సిద్ధార్థ్ నాథ్ సింగ్ చేతుల్లో మాత్రం కూటమి మేనిఫెస్టో కాపీ కనిపించలేదు.. కట్ చేస్తే.. ఆయనకు మేనిఫెస్టో కాపీని ఇవ్వడానికి ప్రయత్నించారు.. కానీ.. ఆయన తన చేతులతో మేనిఫెస్టో కాపీ పట్టుకోవడానికి నిరాకరించారు.. మేనిఫెస్టో కాపీ చేతికి ఇస్తున్నా బీజేపీ ఇన్చార్జ్ సిద్ధార్థ్‌సింగ్ వద్దని వారిస్తూ సైగలు చేశారు.. అయితే.. వీటన్నింటికి సవా లక్ష కారణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
పేరుకు పొత్తులో మూడు పార్టీలున్నా.. మేనిఫెస్టో ఇద్దరిదేనా? అన్నట్టు కనిపించింది. కూటమి మేనిఫెస్టోకి మోదీ గ్యారంటీ, బీజేపీ మద్దతు లేనట్టేనా?.. అంటే అవునన్నట్టే మేనిఫెస్టో బుక్ లెట్.. ఆ కార్యక్రమం కనిపించింది. మేనిఫెస్టో కాపీపై చంద్రబాబు, పవన్ ఫోటోలు మాత్రమే.. ఉండటం.. కాపీపై ఎక్కడా కనిపించని మోదీ ఫోటో, బీజేపీ గుర్తు కనిపించకపోవడంతో కమలం నేతలు గుస్సా అయ్యారు.. అంతేకాకుండా.. కనీసం మేనిఫెస్టోపై కూటమి సింబల్ ఎక్కడా కనిపించలేదు.. దీంతో కాపీని పట్టుకునేందుకు బీజేపీ నేతలు ఇష్టపడలేదని తెలుస్తోంది.