జైలుకెళ్లి యోగా చేస్తానన్న వ్యక్తి..
ఎందుకు భయపడుతున్నడు?
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ రాష్ట్రంలో అల్లర్లకు ప్లాన్ చేస్తున్నారని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ముసుగు వేసుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. జైలుకు వెళ్లి యోగా చేస్తానన్న కేటీఆర్ ఎందుకు బయపడుతున్నారని ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మంత్రి సీతక్క చిట్‌చాట్ చేశారు. కేటీఆర్ తన సమస్యను రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు.
కేబినెట్ ఆమోదం తీసుకొని ఈ కార్ రేస్‌కు మాజీ మంత్రి కేటీఆర్ డబ్బులు చెల్లించారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం అనుమతి లేని అంశానికి సభలో చర్చ ఎందుకు అని నిలదీశారు. గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన కేసుకు సభలో చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో అంబేడ్కర్‌ను, అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను అవమానించారని మంత్రి సీతక్క అన్నారు. బీఏసీలో ఈ ఫార్ములా మీద చర్చ కోసం బీఆర్‌ఎస్ ఎందుకు అడగలేదని అన్నారు. కేటీఆర్‌కు నిజాయితీ లేదని.. అందుకే అల్లర్లకు ప్లాన్ చేస్తున్నారని మంత్రి సీతక్క విమర్శలు చేశారు.