హైదరాబాద్: దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KCR) పరామర్శించారు. ఆదివారం ఉదయం మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేటీఆర్.. నందిత చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆమె తల్లి, సోదరిని ఓదార్చారు. అనంతరం మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించారన్న వార్త విని షాక్‌కు గురయ్యానని చెప్పారు. విదేశాల్లో ఉండటం వల్ల ఆమె అంత్యక్రియలకు రాలేకపోయానని తెలిపారు. లాస్య నందితను గత 10 రోజులుగా అనేక ప్రమాదాలు వెంటాడాయని పేర్కొన్నారు. ఏడాది క్రితమే ఆమె తండ్రి సాయన్న మరణించారని తెలిపారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు.
కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం తెల్లవారుజామన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ గుర్తుతెలియని భారీ వాహనాన్ని వెనుక నుంచి ఢికొన్ని.. అదుపుతప్పి రోడ్డు పక్కనున్న రెయిలింగ్‌ను గుద్దుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారు ముందు సీట్లో కూర్చున్న నందిత తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు.